AICTE : విద్యార్థులకు గుడ్ న్యూస్.. బీటెక్‌లో చదవకపోయినా ఎంటెక్‌లో చేరొచ్చు

బీఈ, బీటెక్‌లో ఏ బ్రాంచి చదివితే ఎంఈ, ఎంటెక్‌లో అదే బ్రాంచిలో చేరాలి. ఇప్పటివరకు ఉన్న విధానం ఇదే. కానీ బీటెక్‌లో చదవలేకపోయిన కోర్సును ఎంటెక్‌లో చదివేలా జాతీయ సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనలు తీసుకొచ్చింది.

AICTE : విద్యార్థులకు గుడ్ న్యూస్.. బీటెక్‌లో చదవకపోయినా ఎంటెక్‌లో చేరొచ్చు

AICTE : బీఈ, బీటెక్‌లో ఏ బ్రాంచి చదివితే ఎంఈ, ఎంటెక్‌లో అదే బ్రాంచిలో చేరాలి. ఇప్పటివరకు ఉన్న విధానం ఇదే. కానీ బీటెక్‌లో చదవలేకపోయిన కోర్సును ఎంటెక్‌లో చదివేలా జాతీయ సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనలు తీసుకొచ్చింది. కొన్ని ప్రత్యేక కోర్సుల్లో ఈ అవకాశం కల్పిస్తారు. సంప్రదాయ బ్రాంచీలకు భిన్నంగా గతేడాది(2020) నుంచి బీఈ, బీటెక్‌లో సైబర్‌ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌, డాటా సైన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, నెట్‌వర్క్స్‌ తదితర కోర్సులను ప్రవేశపెట్టారు.

తెలంగాణ రాష్ట్రంలోని 70 కాలేజీల్లో ఈ కోర్సులు నిర్వహిస్తుండగా, వీటిల్లో చేరిన వారు ఫస్టియర్ పూర్తి చేసుకున్నారు. 2019-20 విద్యాసంవత్సరం నుంచి ఎంటెక్‌లోనూ ఇవే కోర్సులను ప్రవేశపెట్టారు. వీటిల్లో ఎవరిని చేర్చుకోవాలన్న అంశంపై స్పష్టత లేదు. బీటెక్‌ తొలి బ్యాచ్‌ పూర్తికాకుండానే ఎంటెక్‌లో ప్రవేశాలు కల్పించడమెలా అన్న ప్రశ్న తలెత్తింది. దాంతో బీటెక్‌లో సంబంధిత సబ్జెక్ట్ చదవకపోయినా ఎంఈ, ఎంటెక్‌లో ఆయా కోర్సుల్లో చేరవచ్చని ఏఐసీటీఈ స్పష్టతనిచ్చింది. ఈ ఏడాది(2021) గేట్‌, పీజీఈసెట్‌ ద్వారా ప్రవేశాలు పొందేవారు కూడా కొత్త కోర్సుల్లో చేరవచ్చు.