educational institutions Closed : తెలంగాణలో విద్యా సంస్థలు మూసివేత

పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం బడులు మూసివేసేందుకే మొగ్గు చూపింది. రాష్ట్రంలో రేపటి నుంచి విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

educational institutions Closed : తెలంగాణలో విద్యా సంస్థలు మూసివేత

Schools Closed In Telangana

educational institutions closed in Telangana : తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాలయాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో బడులు మూసివేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. రాష్ట్రంలో రేపటి నుంచి విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్కూళ్లలో కరోనా వ్యాప్తిపై మంగళవారం (మార్చి 23, 2021) మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటన విడుదల చేశారు. రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని స్కూల్స్, కాలేజీలు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. తాత్కాలికంగా స్కూళ్లు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. మెడికల్ కాలేజీలు మినహా అన్ని విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి నిరోధించడానికి విద్యా సంస్థలను మూసివేస్తున్నామని చెప్పారు.

ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యాసంస్థలను మూసివేశాయని తెలిపారు. మన రాష్ట్రంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కరోనా వ్యాప్తి విషయంలో ఆందోళన వ్యక్తమవుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని వారి నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా వస్తున్నాయని చెప్పారు.

ఈ పరిస్థితులను సంపూర్ణంగా సమీక్షించిన మీదట విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలన్నింటినీ మూసివేస్తున్నట్లు తెలిపారు. రేపటి నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

మూసివేత ఆదేశాలు వైద్య కళాశాలు మనిహాయించి రాష్ట్రంలోని అన్ని హాస్టల్స్, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికీ వర్తిస్తాయిని తెలిపారు. విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్ లైన్ శిక్షణా తరగతులు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజనీకం అందరూ కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలన్నారు. విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించి శానిటైజేషన్ తదితర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తెలంగాణవ్యాప్తంగా 700 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్కూల్స్ మూసివేయటమే మంచిదని అభిప్రాయపడ్డారు. వైద్య ఆరోగ్యశాఖ కూడా స్కూల్స్ ను మూసివేయాలని ఆదేశించింది. ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ ముగిసిన అనంతరం అసెంబ్లీకి వెళ్లిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. విద్యా సంస్థల మూసివేతపై ప్రకటన విడుదల చేశారు.