బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు : అఖిలప్రియ కస్టడీ కోరుతూ పిటిషన్, సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయాలన్న పోలీసులు

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు : అఖిలప్రియ కస్టడీ కోరుతూ పిటిషన్, సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయాలన్న పోలీసులు

Andhra Pradesh former Minister Bhuma Akhila Priya : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు దర్యాప్తులో వేగం పెంచారు పోలీసులు. ఏపీ మాజీ మంత్రి, టీడీపీ లీడర్ అఖిల ప్రియ కస్టడీ కోరుతూ..బోయిన్ పల్లి పోలీసులు సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కిడ్నాప్‌ కేసులో అరెస్ట్ అయి చంచల్ గూడ జైల్లో ఉన్న భూమా అఖిల ప్రియ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై 2021, జనవరి 08వ తేదీ శుక్రవారం సికింద్రాబాద్ కోర్టు విచారణ జరిపింది. అంతకముందే..బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు.

2021, జనవరి 09వ తేదీ నుంచి ఈ నెల 15 వరకు అఖిల ప్రియను కస్టడీలోకి ఇవ్వాలని కోర్టుకు పోలీసులు కోరారు. భూమా అఖిల ప్రియ అనుచరులకు మరికొన్ని కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని, అఖిల ప్రియ భర్తతో సహా మిగతా నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని వెల్లడించారు. బాధితులతో సంతకాలు చేయించుకున్న దస్త్రాలను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. వీరిని అరెస్టు చేశాక..కిడ్నాప్ సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయాలని కోర్టుకు వెల్లడించారు.

మరోవైపు..కిడ్నాప్ కథానాయకుడు గుంటూరు శ్రీనుగా గుర్తించారు. ఇతను భూమా అఖిలప్రియ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడని, నంద్యాల ఉపఎన్నికల్లోనూ అతడు కీలకంగా వ్యవహరించాడని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే..శ్రీను లగ్జరీ జీవితానికి సంబంధించిన వీడియో టెన్‌ టీవీ చేతికి చిక్కింది. హెలికాప్టర్లలో సరదాలు.. విలాసవంతమైన జీవితాన్ని శ్రీను గడిపేవాడు. బోయిన్ పల్లి కిడ్నాప్‌ ప్లాన్, రెక్కీ అంతా శీను కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. శ్రీనగర్ కాలనీలో ఐటీ అధికారుల డ్రెస్‌లను అద్దెకు శ్రీను తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. భార్గవరామ్‌కు రైట్‌హ్యాండ్‌గా ఉంటున్న శీను.. గత చరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.