హైదరాబాద్‌లో మరో లాజిస్టిక్ పార్కు

హైదరాబాద్‌లో మరో లాజిస్టిక్ పార్కు

Another logistics park in Hyderabad : అందివచ్చిన అవకాశాలన్నింటినీ హెచ్‌ఎండీఏ సద్వినియోగం చేసుకుంటోంది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్‌ అధారిటీ ప్రణాళికలన్నీ ఒక్కొక్కటిగా రెడీ అవుతున్నాయి. అందులో భాగంగానే బాటసింగారంలో సిద్ధమైన లాజిస్టిక్‌ పార్క్‌ను మంత్రి కేటీఆర్‌ ఇవాళ ప్రారంభించనున్నారు. మరి ఈ లాజిస్టిక్‌ పార్కుల స్పెషాలిటీ ఏంటి.. అక్కడ ఉంటే సౌకర్యాలేంటి..?

హెచ్ఎండీఏ నిర్మిస్తున్న లాజిస్టిక్‌ పార్కులు సిద్ధమవుతున్నాయి. గతేడాది ఇబ్రహీంపట్నం మంళ్లపల్లి వద్ద పబ్లిక్ – ప్రైవేట్‌ పాట్నర్‌షిప్‌ పద్దతిలో హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన లాజిస్టిక్ పార్కు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఔటర్‌ రింగు రోడ్డు పెద్దఅంబర్‌పేట ఇంటర్‌చేంజ్‌కు సమీపంలోని బాటసింగారం వద్ద మరో పార్కు అందుబాటులోకి రానుంది.

లాజిస్టిక్ పార్కులకు అవసరమైన భూములను హెచ్‌ఎండీఏ అందించగా.. నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రైవేటు సంస్థలు వెచ్చిస్తున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యంలో ఈ పార్కుల నిర్వహణ జరుగుతోంది. సరుకు రవాణా సాఫీగా సాగడంతో పాటు వందలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో బాటసింగారం వద్ద నిర్మించిన లాజిస్టిక్‌ పార్కును ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారి సమీపంలో 40 ఎకరాల్లో సుమారు 40 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది.

దేశ నలుమూలల నుంచి వచ్చే సరుకు రవాణ వాహనాలకు అవసరమైన అన్ని రకాల సేవలను అందించడమే లక్ష్యంగా లాజిస్టిక్‌ పార్కులను అత్యున్నత ప్రమాణాలతో నిర్మించాలని నిర్ణయించింది హెచ్ఎండీఏ. హై సెక్యూరిటీ విధానంతో 24 గంటల పాటు సేవలందించేలా నిర్వహణ వ్యవస్థ పని చేస్తుంది. మినీ గోడౌన్స్‌, వసతి సౌకర్యం, ఆరోగ్య సంరక్షణ వంటివి లాజిస్టిక్‌ పార్కులో అందుబాటులో ఉంటాయి. ఒకేసారి 5వందల ట్రక్కులు నిలించేందుకు 2 లక్షల చదరపు అడుగుల్లో స్థలం ఏర్పాటు చేశారు.

10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన శీతల గిడ్డంగులను నిర్మించారు. డ్రైవర్ల కోసం విశ్రాంతి గదులు, పెట్రోల్ పంపు, రెస్టారెంట్ వంటి సౌకర్యాలు కూడా ఈ పార్కులో ఉండనున్నాయి. మొత్తంగా.. లాజిస్టిట్ పార్కుల నిర్మాణంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. మరోవైపు ఉపాధికి ఉపాధి.. నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు కూడా తగ్గునున్నాయి.