Medical College : తెలంగాణలో మరో కొత్త మెడికల్ కాలేజీ

తెలంగాణలో త్వరలోనే మరో మెడికల్‌ కాలేజీ ప్రారంభం కానుంది. వైద్య కళాశాలను ప్రారంభించేందుకు సహస్ర విద్యా సొసైటీకి.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

Medical College : తెలంగాణలో మరో కొత్త మెడికల్ కాలేజీ

Telangana (6)

medical college in Telangana : తెలంగాణలో త్వరలోనే మరో మెడికల్‌ కాలేజీ ప్రారంభం కానుంది. వైద్య కళాశాలను ప్రారంభించేందుకు సహస్ర విద్యా సొసైటీకి.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. హనుమకొండ జిల్లాలోని వంగపహాడ్‌ గ్రామంలో ‘ప్రతిమ రిలీఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, వరంగల్‌’ పేరిట మెడికల్‌ కాలేజీకి అనుమతులు ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కాలేజీతో మరో 150 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు కల్పించనున్నారు.

మెడికల్ కాలేజీకి అనుబంధంగా సహస్ర సంస్థ ఇప్పటికే 330 పడకల ఆస్పత్రిని నిర్వహిస్తోంది. వైద్య కళాశాల స్థాపనకు సహస్ర సంస్థ చేసుకున్న ప్రతిపాదన పరిశీలనకు.. మౌలిక సదుపాయాలను, ఇతర వసతులను పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్‌ను జారీచేసింది.

Microsoft : విద్యార్థులకు గొప్ప అవకాశం, వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాం.. ఇలా అప్లయ్ చేసుకోండి

సహస్ర సంస్థకు వంగపహాడ్‌ గ్రామంలో 15 ఎకరాలకు పైగా వ్యవసాయేతర స్థలం ఉన్నట్టు గుర్తించింది ఉన్నతస్థాయి కమిటీ. ఆస్పత్రి, మెడికల్‌ కాలేజీకి సంబంధించిన భవన నిర్మాణాలకు సంబంధిత అధికారుల నుంచి ఇప్పటికే అనుమతులు లభించాయి. వరంగల్‌ జిల్లాలో ఇప్పటికే కాకతీయ మెడికల్‌ కాలేజీ ఉండగా, ఇప్పుడు ప్రతిమ రిలీఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ పేరుతో.. మరో వైద్యకళాశాల రాబోతోంది.

తెలంగాణలోని కరీంనగర్‌లో ప్రతిమ గ్రూప్‌కు ఓ మెడికల్ కాలేజీ ఉంది. 20 ఏళ్లుగా నడుస్తున్న ఆ కాలేజీలో పదకొండు వందల పడకలతో ఆస్పత్రి కూడా ఉంది. ఇక కాచీగూడ, కూకట్‌పల్లిలలో కూడా ప్రతిమ గ్రూప్‌కు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉన్నాయ్‌. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యాన్ని అందుబాటులోకి తెవడమే లక్ష్యంగా.. హన్మకొండలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రతిమ గ్రూప్‌ ఎండీ డాక్టర్‌ హరిణి బోయినపల్లి ప్రకటించారు.

Software : ఫ్రెషర్స్ కి శుభవార్త.. ఐటీలో లక్ష ఉద్యోగాలు

ఇక.. తెలంగాణలో ప్రస్తుతం 9 ప్రభుత్వ, 23 ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 5వేల 90 మెడికల్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. మెడికల్‌ కౌన్సిల్‌లో ప్రస్తుతం 36వేల మంది డాక్టర్లున్నారు. వీరిలో 7వేల 758 మంది ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తుండగా.. మరో 15వందల 18 డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం వెయ్యి 87 మందికి ఒక డాక్టర్‌ చొప్పున అందుబాటులో ఉన్నట్టు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. వెయ్యి మందికి ఒక డాక్టర్‌ చొప్పున అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించింది.