ఏపీ – తెలంగాణ ఆర్టీసీ, దసరా వచ్చేస్తోంది, బోర్డర్ దాటేదెప్పుడు

  • Published By: madhu ,Published On : October 8, 2020 / 06:52 AM IST
ఏపీ – తెలంగాణ ఆర్టీసీ, దసరా వచ్చేస్తోంది, బోర్డర్ దాటేదెప్పుడు

AP – Telangana RTC : లాక్‌డౌన్‌తో రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుకు పడ్డ బ్రేక్‌కు.. ఇప్పట్లో గ్రీన్‌ సిగ్నల్‌ పడేలా లేదు. తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులెప్పుడు తిరుగుతాయన్నది భేతాళ ప్రశ్నగానే మిగిలిపోతోంది. అటు ఏపీ, ఇటు తెలంగాణలు అంతర్రాష్ట్ర సర్వీసు ఒప్పందంపై తేల్చకపోవడంతో బస్సులు బోర్డర్‌ దాటడం లేదు. చర్చల మీద చర్చలు జరుగుతున్నా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు.



కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులు.. ఇంకా ప్రారంభం కాలేదు. ఇరు రాష్ట్రాల్లో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభమైనా.. బస్సు సర్వీసుల విషయంలో ఒప్పందాలను పునర్ సమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతోంది.



దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. ఈ అంశంపై ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు పలుసార్లు సమావేశమైనప్పటికీ.. ఏకాభిప్రాయం మాత్రం కుదరడం లేదు. ఇక బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఈడీల సమావేశంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కిలోమీటర్లు, రూట్లపై స్పష్టత రాకపోవడంతో బస్సులు తిప్పడంపై నిర్ణయానికి రాలేకపోయారు ఆర్టీసీ ఉన్నతాధికారులు.



తెలంగాణలో తమ బస్సులు తిరుగుతున్న దూరాన్ని తగ్గించుకునేందుకు ఏపీ అంగీకరించింది. లక్షా 60 వేల కిలోమీటర్లు మాత్రమే తిప్పుతామని ప్రతిపాదించింది. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ అధికారులు తెలిపారు. అయితే రూట్లపై మాత్రం నిర్ణయం తీసుకోలేకపోయారు. దీనిపైనే పీఠముడి పడింది.



మరోసారి సమావేశం కావాలని మాత్రమే ఈడీలు నిర్ణయం తీసుకున్నారు. ఈసారి సమావేశంలో అయినా బస్సులు తిప్పడంపై నిర్ణయం తీసుకుంటారని ఆశించిన ప్రయాణికులకు మరోసారి నిరాశ తప్పలేదు. దసరా పండుగ సీజన్‌లోనైనా రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు ఉంటాయా.. ఉండవా అని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.



ఇప్పటికే అధికారుల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. చివరకు ఎండీలు కూడా సమావేశమయ్యారు. కానీ ఒప్పందం మాత్రం కుదరలేదు. దీంతో బస్సులు బోర్డర్లు దాటడం లేదు. ప్రైవేటు బస్సులు దూసుకెళ్తున్నా.. ఆర్టీసీ బస్సులు మాత్రం సరిహద్దులతోనే ఆగిపోతున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య ప్రైవేట్‌ సర్వీసులు తిరుగుతున్నాయి. వందల బస్సులు రోడ్డెక్కాయి.



ఆర్టీసీ కూడా లేకపోవడంతో వాటికి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. పండగ సీజన్‌లో అవి ఇష్టం వచ్చినట్లు రేట్లు వసూలు చేసే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల్లో ఎవరూ బస్సులు నడపకుంటే ప్రైవేట్ ట్రావెల్స్‌కు లాభం చేకూరుతుదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అధికారుల తీరుతో ప్రయాణికులు నష్టపోతున్నారు.



త్వరలో పండగ సీజన్ రాబోతోంది. ఈ సమయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఒప్పందాల పేరుతో రెండు రాష్ట్రాలు పట్టుదలకు పోతే దాని ప్రభావం ఆర్టీసీ ఆదాయంపై దారుణంగా పడుతుంది. సాధారణంగా దసరా సీజన్‌లో ఆర్టీసీలకు భారీగా ఆదాయం ఉంటుంది. అదనపు సర్వీసులు తిప్పినా సరిపోవు. అదనపు ఛార్జీలు కూడా వసూలు చేస్తుంటాయి. అలాంటి కీలక సమయంలో బస్సులు రోడ్డెక్కకపోతే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు.



దీంతో తాత్కాలికంగా అయినా సర్వీసులు నడపాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని నెలలుగా రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిరగడం లేదు. ఇప్పుడు కూడా తిరగకపోతే ఆర్టీసీలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. మొత్తానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సర్వీసులను తిప్పే విషయంలో ఏకాభిప్రాయానికి వస్తేనే ఇరు రాష్ట్రాల మధ్య పూర్తిస్థాయిలో మళ్లీ ఆర్టీసీ బస్సులు తిరిగేలా కనిపిస్తోంది.