BJP Meeting Permission Cancelled : చివరి నిమిషంలో బీజేపీకి షాక్ ఇచ్చిన ప్రిన్సిపల్.. బహిరంగ సభకు అనుమతి రద్దు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో ఆగస్టు 27న బీజేపీ నిర్వహించ తలపెట్టిన సభకు అనుమతి రద్దైంది. సభ నిర్వహణకు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ఐలయ్య అనుమతి నిరాకరించారు.

BJP Meeting Permission Cancelled : చివరి నిమిషంలో బీజేపీకి షాక్ ఇచ్చిన ప్రిన్సిపల్.. బహిరంగ సభకు అనుమతి రద్దు

BJP Meeting Permission Cancelled: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో ఆగస్టు 27న బీజేపీ నిర్వహించ తలపెట్టిన సభకు అనుమతి రద్దైంది. సభ నిర్వహణకు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ఐలయ్య అనుమతి నిరాకరించారు. పోలీసుల నుంచి ఎటువంటి అనుమతి లేనందున సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ఈ మేరకు ఆయన బీజేపీ నేతలకు లేఖ రాశారు.

Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి.. 27న హన్మకొండలో భారీ సభ

కాగా, ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకావాల్సి ఉంది. చివరి నిమిషంలో సభకు అనుమతి రద్దవడంతో బీజేపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే గ్రౌండ్ కోసం రూ.5లక్షలు చెల్లించామన్నారు. ఇప్పుడు సడెన్ గా పర్మిషన్ లేదంటే ఎలా అని మండిపడుతున్నారు. కాగా, బీజేపీ సభకు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ఇంతకుముందు అనుమతి ఇచ్చారు. ఇప్పుడేమో పోలీసుల నుంచి సమాచారం లేనందున అనుమతి రద్దు చేస్తున్నాం అంటూ తాజాగా ఓ లేఖ రాశారు. సభ కోసం బీజేపీ నేతలు ఇచ్చిన రూ.5లక్షలను రీఫండ్ చేస్తామని లేఖలో తెలిపారు ప్రిన్సిపల్ ఐలయ్య.

సడెన్ గా సభకు అనుమతి రద్దు చేయడంపై బీజేపీ నేతలు సీరియస్ అయ్యారు. ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్, పోలీసులపై న్యాయపోరాటానికి బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. మరోవైపు బీజేపీ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ హన్మకొండ ఏసీపీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు బీజేపీ నేతలు.

కాగా, బండి సంజయ్ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. పాదయాత్ర ఆపాలని బండి సంజయ్‪కు పోలీసులు ఇచ్చిన నోటీసును హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ అంశంపై గురువారం విచారణ జరిపిన కోర్టు, సాయంత్రం తీర్పు వెల్లడించింది. ప్రభుత్వం, బండి సంజయ్ తరఫు లాయర్లు కేసులో తమ వాదనలు వినిపించారు.

బండి సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను పెన్‌డ్రైవ్‌లో సమర్పించింది ప్రభుత్వం. అయితే, పెన్‌డ్రైవ్‌ ఆధారాలు కోర్టులో చెల్లవని కోర్టు వ్యాఖ్యానించింది. డాక్యుమెంట్ల రూపంలో ఆధారాలు సమర్పించకపోవడంపై ప్రభుత్వం, పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు యాత్రకు అనుమతి తీసుకున్నారా అని బండి సంజయ్ తరఫు లాయర్లను కోర్టు ప్రశ్నించింది. అయితే, తాము యాత్రకు ముందుగానే అనుమతి తీసుకున్నామని, పాదయాత్ర జరిగే ప్రతి కమిషనరేట్ పరిధిలో అనుమతి తీసుకున్నట్లు బండి తరఫు లాయర్లు చెప్పారు.

‘‘బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు సరైన ఆధారాలు చూపించలేదు. ఎక్కడ, ఎలాంటి వ్యాఖ్యలు చేశారో పోలీసులు నిరూపించలేకపోయారు. సరైన సాక్ష్యాలు చూపకపోవడంతో కోర్టు.. బండి సంజయ్ యాత్రకు అనుమతించింది. ఎలాంటి షరతులు లేకుండానే కోర్టు యాత్రకు అనుమతించింది’’ అని బండి సంజయ్ తరఫు లాయర్ రచనా రెడ్డి చెప్పారు. కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో బండి సంజయ్ యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. స్టేషన్ ఘన్‌పూర్ నుంచే ఈ యాత్ర ప్రారంభమవ్వబోతుంది. ఈ నెల 27న యాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండలో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేసింది.