హైదరాబాద్ లో మళ్లీ డబుల్‌ డెక్కర్‌ బస్సులు..టెండర్‌ దక్కించుకున్న అశోక్‌ లేలాండ్‌

హైదరాబాద్ లో మళ్లీ డబుల్‌ డెక్కర్‌ బస్సులు..టెండర్‌ దక్కించుకున్న అశోక్‌ లేలాండ్‌

double decker buses : హైదరాబాద్ లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. తెలంగాణలో త్వరలో ప్రవేశపెట్టనున్న డబుల్ డెక్కర్‌ బస్సులకు టీఎస్ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. డబుల్ డెక్కర్‌ బస్సుల టెండర్‌ను అశోక్‌ లేలాండ్‌ దక్కించుకుంది. నగర అవసరాలకు తగ్గట్టుగా బస్సులను తయారు చేసే పనిలో ఆశోక్‌ లేలాండ్‌ కంపెనీ నిమగ్నమైంది.

నగరంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులు ప్రవేశపెట్టాలంటూ ఇటీవల మంత్రి కేటీఆర్‌ను ఓ సిటిజన్‌ ట్విట్టర్‌లో కోరారు. డబుల్‌ డెక్కర్‌ బస్సుల అంశాన్ని పరిశీలించాలంటూ ఆర్టీసీ అధికారులను మంత్రి కేటీఆర్‌ కోరారు. దీనికి వెంటనే స్పందించిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌.. డబుల్ డెక్కర్‌ బస్సుల కోసం టెండర్లు ఆహ్వానించారు.

గతంలో హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను నడిపారు. మెహదీపట్నం – సికింద్రాబాద్‌ స్టేషన్, సికింద్రాబాద్‌–జూపార్కు, సికింద్రాబాద్‌–సనత్‌నగర్, మెహిదీపట్నం–చార్మినార్‌ మార్గాల్లో 16 ఏళ్ల క్రితం వరకు డబుల్‌ డెక్కర్‌ బస్సులు పరుగులు పెట్టాయి. ఆ బస్సు అప్పర్‌ డెక్‌లో కూర్చుని ట్యాంక్‌బండ్‌ మీదుగా ప్రయాణిస్తుంటే ఆ సరదానే వేరుగా ఉండేది.

కానీ సాధారణ బస్సులతో పోల్చుకుంటే ఈ బస్సుల నిర్వహణ వ్యయం చాలా ఎక్కువ. అందుకే అప్పట్లో డిమాండ్‌ ఉన్నప్పటికీ నష్టాలు భరించలేక ఆర్టీసీ వాటిని వదిలించుకుంది. తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో ఆర్టీసీ ఈ బస్సులు తీసుకుంటోంది. ఎంత కొత్తతరం నమూనా బస్సు అయినా.. నిర్వహణ వ్యయం మాత్రం తడిసి మోపెడవుతుందని అధికారులు భయపడుతున్నారు.

తొలుత 40 బస్సులను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలనే ఆదేశాలు వచ్చినా.. ఖర్చుకు భయపడి 25 మాత్రమే కొంటున్నారు. ఒకవేళ నష్టాలు వస్తే వాటికి తగ్గట్టుగా ప్రభుత్వం రాయితీలు ఇస్తే అవసరమైనన్ని కొనాలని అధికారులు భావిస్తున్నారు. నష్టాల మాటెలా ఉన్నా.. కోటి జనాభాతోపాటు దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ కు డబుల్‌ డెక్కర్‌ అదనపు ఆకర్షణగా నిలుస్తుందనడంలో మాత్రం సందేహం లేదు.