ఈ డాక్టర్ చేసింది నిబంధనల ఉల్లంఘనా..మానవత్వమా

  • Published By: bheemraj ,Published On : July 15, 2020 / 09:10 PM IST
ఈ డాక్టర్ చేసింది నిబంధనల ఉల్లంఘనా..మానవత్వమా

ఆయన చేసేది డాక్టర్ వృత్తి అయినా ట్రాక్టర్ అవతారమెత్తాడు. కరోనా సోకిందంటేనే కుటుంబ సభ్యులు కూడా దగ్గరికిరాని సమయంలో కరోనా బాధిత మృతదేహాన్ని ట్రాక్టర్ లో తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు ఓ డాక్టర్. అతనిపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. అందుకు మెచ్చుకోవాల్సింది పోయి అధికారులు మాత్రం సదరు డాక్టరు సీరియస్ అయ్యారు. డాక్టర్ అయి ఉండి ట్రాక్టర్ ఎలా నడిపావని ప్రశ్నించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

స్వయంగా ట్రాక్టర్ నడిపి కరోనా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్న డాక్టర్ శ్రీరామ్ పై పెద్దపల్లి కలెక్టర్, అధికారులు సీరియస్ అయ్యారు. డాక్టర్ అయి ఉండి ట్రాక్టర్ ఎలా నడిపావని డా.శ్రీరామ్ ను ప్రశ్నించారు. విధి నిర్వహణలో శ్రీరామ్ చూపిన అంకితభావంపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి హరీష్ రావు సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. డాక్టర్ శ్రీరామ్ పై సర్వత్రా ప్రసంశలు వెల్లువెత్తుంటే అధికారులు వివరణ అడగడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల పెద్దపల్లి జిల్లాలో కరోనాతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తి అంత్యక్రియలు ఎవరూ హాజరుకాకపోవడంతో స్వయంగా ట్రాక్టర్ నడిపి కరోనా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అయితే డా.శ్రీరామ్ పై పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ అధికారులు సీరియస్ అయ్యారు.

పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆదివారం జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చేరారు. ఐసోలేషన్ వార్డుకు అందించి చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోవడంతో అదే రోజు ఉదయం 9.30 గంటలకు చనిపోయాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా మృతుడి కుమారులు, మరో ఇద్దరు కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వచ్చారు. డెడ్ బాడీని తరలించేందుకు ఆంబులెన్స్ ను తీసుకురావాలని ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులను కోరారు. అయితే మృతదేహాన్ని తరలించేందుకు మాత్రం కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాలేదు.

మృతదేహాన్ని ఎవరూ తీసుకెళ్లకపోవడంతో డీఎంహెచ్ వో ప్రమోద్ కు సమాచారం ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ జిల్లా సర్వైవలెన్సై అధికారి డాక్టర్ పెండ్యాల శ్రీరామ్ ను పంపారు. మున్సిపల్ అధికారులు శవాన్ని తరలించేందుకు ఒక ట్రాక్టర్ ను ఏర్పాటు చేశారు. అయితే చనిపోయిన వ్యక్తి కరోనా పాజిటివ్ అని తేలడంతో వాహనం నడపటానికి ట్రాక్టర్ డ్రైవర్ నిరాకరించాడు. అప్పటికే మధ్యాహ్నం కావస్తుండటంతో వైద్యులు శ్రీవాణి, శిరీష, మమత, స్టాఫ్ నర్స్ శ్యామల సహకారంతో మృతదేహాన్ని ట్రాక్టర్ లో వేయించిన వైద్యుడు పెండ్యాల శ్రీరామ్ తానే డ్రైవర్ అవతారమెత్తాడు.

స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ స్మశాన వాటికకు తీసుకెళ్లారు. బంధువుల సహకారంతో కోవిడ్ నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి హరీష్ రావు కూడా శ్రీరామ్ ను అభినందించారు. మనుషుల్లో మానవత్వం బతికే ఉందని శ్రీరామ్ నిరూపించారని కొనియాడారు. మానవత్వంలోనే దైవత్వాన్ని దర్శించుకునేలా చేశారని కరోనాపై యుద్ధం చేస్తున్న అందరికీ మీరే స్ఫూర్తి కావాలన్నారు.

డాక్టర్ శ్రీరామ్ చూపిన మానవత్వానికి ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా డాక్టర్ శ్రీరామ్ ను అభినందించారు. మృతదేహాన్ని ట్రాక్టర్ తరలిస్తున్నా పెండ్యాల శ్రీరామ్ ను ట్యాగ్ చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వైద్యుడి చొరవ, అంకితభావం సమాజానికి స్ఫూర్తిదాయకం కావాలని ఆకాక్షించారు. డాక్టరే డ్రైవర్ గా మారి మృతదేహాన్ని తరలించిన తీరు ఆయన అభినందించారు.