పోలియో చుక్కలు వేయించుకున్న కాసేపటికే చిన్నారి మృతి

పోలియో చుక్కలు వేయించుకున్న కాసేపటికే చిన్నారి మృతి

baby girl dies after taking pulse polio: మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పోలియో చుక్కలు వేయించుకున్న చిన్నారి మృతి చెందింది. పోలియో చుక్కలు వేసిన కాసేపటికే అపస్మారక స్థితికి వెళ్లి చిన్నారి ఆ తర్వాత విగతజీవిగా మారింది. దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మహేశ్వరంలో ఆదివారం(జనవరి 31,2021) ఈ ఘటన జరిగింది.

జగద్గిరిగుట్టకు చెందిన యాదగిరి, మహేశ్వరానికి చెందిన రమీలకు ఏడాదిన్నర కిందట పెళ్లి జరిగింది. వీరికి 2 నెలల 16 రోజుల కూతురు దీక్షిత ఉంది. ప్రస్తుతం తల్లి చిన్నారితో కలిసి పుట్టింట్లో ఉంటోంది. ఆదివారం ఉదయం 11.45 గంటలకు శంభీపూర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారికి పోలియో చుక్కలు వేయించారు. కాసేపటికే(11.55కి) పాప తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆందోళనకు గురైన తల్లి.. వెంటనే మియాపూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి పాపను తీసుకెళ్లింది. కాగా, అప్పటికే పాప మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో పాప తల్లిదండ్రులు షాక్ కి గురయ్యారు. పాప ఇక లేదు అని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపించారు.

కాగా, చిన్నారి మృతికి పోలియో చుక్కలే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం పాప మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక పాప మృతికి అసలు కారణం ఏంటో తెలుస్తుందని పోలీసులు తెలిపారు. పాప మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది.

ఈ ఘటనపై జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి మల్లికార్జున్‌ స్పందించారు. పోలియో చుక్కలు వికటించే అవకాశం లేదన్నారాయన. ఒక్కో సీసాలో 40 చుక్కలుంటాయన్నారు. పాపకు వేసిన తర్వాత మరో 17 మందికి చుక్కల మందు వేశామన్నారు. ఎవరిలోనూ దుష్పరిణామాలు లేవన్నారు. పాప మృతికి ఇతర కారణాలు ఉండొచ్చని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా జనవరి 31న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. 0-5 ఏళ్ల లోపు చిన్నారులందరికి పల్స్ పోలియో చుక్కలు వేశారు.