హైదరాబాద్‌కు సీఎం కేసీఆర్, ఢిల్లీకి బండి సంజయ్, ఏం జరుగుతోంది

  • Published By: madhu ,Published On : December 14, 2020 / 07:00 AM IST
హైదరాబాద్‌కు సీఎం కేసీఆర్, ఢిల్లీకి బండి సంజయ్, ఏం జరుగుతోంది

Bandi Sanjay in Delhi : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఢిల్లీబాట పట్టారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత ఆయన రెండోసారి హస్తిన వెళ్లారు. సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే.. బండి సంజయ్‌ హస్తిబాటపట్టడం తెలంగాణ పాలిటిక్స్‌లో ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఢిల్లీ టూర్‌ 2020, డిసెంబర్ 13వ తేదీ శనివారంతో ముగిసింది. మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన కేసీఆర్‌.. ప్రధాని నరేంద్రమోదీతోపాటు.. పలువురు కేంద్రమంత్రులతో వరుసగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, తెలంగాణలో విమానాశ్రయాల మంజూరు, వరదలతో సంభవించిన నష్టపరిహారం నిధుల విడుదలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఆయన కలిసి విన్నవించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన వెంటనే :-
అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగిసిన వెంటనే కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో ఏకాంతంగా భేటీ అయ్యి.. చర్చించారు. ఇద్దరితోనూ కేసీఆర్‌ ఏం చర్చించారన్నది అంతుచిక్కని విషయం. మోదీ, అమిత్‌షాలను కలవడం ఫెడరల్‌ సిస్టంలో భాగమైనప్పటికీ… కేసీఆర్‌ భేటీ వెనుక రాజకీయ కోణాలను సైతం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్‌ టూర్‌ అలా ముగిసిందో లేదో… వెంటనే బండి సంజయ్‌ హస్తినకు వెళ్లారు. దీంతో ఏం జరుగుతోందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

రెండోసారి ఢిల్లీకి బండి సంజయ్ :-
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగిసిన తర్వాత రెండోసారి బండి సంజయ్‌ హస్తినకు వెళ్లడంతో పొలిటికల్‌ చౌరస్తాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీకి, టీఆర్‌ఎస్‌కు మధ్య సయోధ్య కుదిరిందా, బల్దియాలో రెండు పార్టీలు కలిసి మేయర్‌ పీఠాన్ని పంచుకుంటాయా అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సోషల్‌ మీడియాలో సైతం ఇలాంటి పుకార్లే షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ ఊహాగానాలను అటు టీఆర్‌ఎస్‌, ఇటు బీజేపీ వర్గాలు కొట్టి పడేస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన కేవలం అధికారికమేనని… దాంట్లో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఆపార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా…. టీఆర్‌ఎస్‌తో తాము కలవడమేంటని ప్రశ్నిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపట్ల రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని.. కేసీఆర్‌ సర్కార్‌పై రాజీలేని పోరాటం చేసేందుకు
సిద్దమని వారు తేల్చి చెబుతున్నారు.

డిఫెన్స్ లో టీఆర్ఎస్ :-
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్‌ దూకుడుగా వ్యవహరించారు. శరవేగంగా నిర్ణయాలు తీసుకోవడం, అధికార పార్టీని డిఫెన్స్‌లో పడేయడం, ప్రచారంలో ప్రతిరోజు ప్రత్యర్థులకు ఎజెండా ఫిక్స్‌ చేస్తూ ముందుకు సాగారు. దీంతో ఎప్పుడూ అఫెన్స్‌లో ఉండే అధికార టీఆర్‌ఎస్‌… బల్దియా ఎన్నికల్లో డిఫెన్స్‌లో పడిపోయింది. బండిసంజయ్‌ వదిలిన విమర్శలకు సమాధానాలు చెప్పుకోవడంతోనే సరిపోయింది. దీంతో తొలిసారి బీజేపీ బల్దియాలో మెరుగైన ఫలితాలు సాధించింది. ఈ క్రెడిట్‌ అంతా ఆ పార్టీ బండి సంజయ్‌కే దక్కింది.