లాయర్ దంపతుల హ‌త్య.. నిందితుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేస్తే ప్రజలు తిరగబడతారు

లాయర్ దంపతుల హ‌త్య.. నిందితుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేస్తే ప్రజలు తిరగబడతారు

bandi sanjay on advocate couple murder: హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులను బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల దగ్గర దుండగులు దారుణంగా హత్య చేసిన ఘ‌ట‌న రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విష‌యం తెలిసిందే. వామన్‌రావు తల్లిదండ్రులను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఆ పార్టీ నేత‌లు పరామర్శించారు.

తెలంగాణ‌ ప్ర‌భుత్వంపై బండి సంజయ్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇది ప్రభుత్వ హత్యేనని ఆయ‌న‌ ఆరోపించారు. దీని వెనుక పెద్దల హస్తం ఉందన్నారు. పథకం ప్రకారమే న్యాయ‌వాద‌ దంపతులను చంపేశార‌ని, ఈ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారని ఆయ‌న హెచ్చ‌రించారు.

పూర్తి విచార‌ణ‌‌ పూర్తయిన అనంత‌ర‌మే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ హత్యల‌ వెనుక ఎవరున్నారన్న విష‌యం తెలిసిన అనంత‌ర‌మే చర్యలు తీసుకోవాల‌న్నారు. ఈ హ‌త్యల‌ ఘ‌ట‌న‌పై వెంటనే ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ స్పందించాలని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. టీఆర్ఎస్ నేతలు దీనిపై ఎందుకు స్పందించడం లేదని నిల‌దీశారు.

ప్రభుత్వంలోని పెద్దల అవినీతి చిట్టా వామన్ రావు దగ్గర ఉందని… అందుకే ఆయనను అంతమొందించారని బండి సంజయ్ ఆరోపించారు. వామన్ రావు దంపతుల హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన నిన్న డిమాండ్ చేశారు. ప్రభుత్వ అక్రమాలపై వామన్ రావు పోరాటం చేస్తున్నారని చెప్పారు.

లాకప్ డెత్ లతో సహా పలు అక్రమాలపై హైకోర్టులో వామన్ రావు పిటిషన్లు వేశారని… వాటిపై పోరాటం చేస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ పాలనలో అన్యాయానికి గురైన పేదల తరపున పోరాడుతున్నారని చెప్పారు. వామన్ రావుకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించిందని… ఆ ఆదేశాలను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకకు తెలంగాణలో స్థానం లేదని చెప్పేందుకు ఈ హత్యలే నిదర్శనమని అన్నారు.

హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు (49), నాగమణి (45) దంపతులను బుధవారం(ఫిబ్రవరి 17,2021) పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై పట్టపగలే నరికి చంపిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. కారులో వెళ్తున్న లాయర్ దంపతులను అటకాయించి కత్తులతో దాడి చేశారు. లాయర్ ను కారులోంచి రోడ్డుపైకి లాగి అతి కిరాతకంగా చంపేశారు.

మంథని మండలం గుంజపడుగ గ్రామానికి చెందిన వామన్‌రావు, నాగమణి హైకోర్టులో న్యాయవాదులు. పలువురు రాజకీయ నాయకులు, పోలీసులకు వ్యతిరేకంగా అనేక కేసుల్లో వాదనలు వినిపించడంతో పాటు ఇసుక క్వారీయింగ్‌ వంటి అక్రమాలపై వారు హైకోర్టుకు లేఖలు రాశారు. బుధవారం(ఫిబ్రవరి 17,2021) ఉదయం 11 గంటలకు వారు కారు డ్రైవర్‌ సతీశ్‌తో కలిసి మంథని వచ్చారు. అక్కడ ఓ కేసుకు సంబంధించి దస్తావేజులు తీసుకున్నారు. మధ్యాహ్నం 1.50కి తిరిగి హైదరాబాద్‌ బయల్దేరారు.

మంథని నుంచి గుర్తుతెలియని వ్యక్తులు నల్లటి కారులో వీరి వాహనాన్ని వెంబడించారు. కల్వచర్ల సమీపంలో లాయర్‌ కారు ముందు తమ వాహనాన్ని ఆపి అడ్డగించారు. కొబ్బరి బొండాలు నరికే కత్తులతో కారు అద్దాలు పగలగొట్టి వామన్‌రావును కిందకు లాగారు. మెడ, పొట్ట భాగంలో నరికారు. భయంతో కారులోనే ఉండిపోయిన నాగమణి మెడపైనా నరికారు. అప్పటికే రహదారిపై వాహనాలు నిలిచిపోవడం, వాహనదారులు, బస్సుల్లో ఉన్న ప్రయాణికులు అరవడంతో దుండగులు మంథని వైపు పరారయ్యారు. అక్కడున్న వారు 108 సిబ్బందికి సమాచారం అందించారు. అంబులెన్సులో బాధితులను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, తీవ్ర గాయాలు కావడం, రక్తస్రావం జరడంతో దంపతులు మృతి చెందారు.

ప్రభుత్వ పథకాల్లో అవినీతి, అక్రమాలపై తరచూ స్పందించడం, వివాదాస్పదంగా మారిన తగాదాలను వృత్తిపరంగా వామన్‌రావు ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని వారే దంపతులను హతమార్చినట్లు తెలుస్తోంది. తమకు ప్రాణహాని ఉందని వారు హైకోర్టుకు విన్నవించుకోగా రక్షణ కల్పించాల్సిందిగా న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఈ విషయమై ఈ దంపతులు పలుమార్లు రామగుండం సీపీ సత్యనారాయణతో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది.

పెద్దపల్లి-మంథని మార్గంలో రామగిరి మండలం కల్వచర్ల పెట్రోల్‌ పంపు దగ్గర రహదారి పనులు జరుగుతుండటంతో అక్కడ వాహనాలు నెమ్మదిగా వెళ్తుంటాయి. దుండగులు అక్కడ లాయర్‌ వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేశారు. కత్తిపోట్ల తర్వాత రోడ్డుపై పడి ఉన్న వామన్‌రావును స్థానికులు ‘ఎవరు హత్యా యత్నం చేశార’ని ప్రశ్నించగా ‘కుంట శ్రీనివాస్‌’ అనే పేరు చెప్పడం వీడియోలో వినిపిస్తోంది. నిందితులు దాడి అనంతరం వచ్చిన కారులోనే మంథని వైపు వెళ్లారు. అదే కారులో అంతకుముందు మంథనిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హత్యకు పాల్పడింది శ్రీనివాసేనని, గుంజపడుగుకు చెందిన మరో వ్యక్తి కూడా ఇందులో పాల్గొన్నట్లు భావిస్తున్నారు.