Bandi Sanjay On Bodhan : ఛత్రపతి శివాజీ విగ్రహం ఎందుకు పెట్టొద్దు? బోధన్ ఘటనపై బండి ఆగ్రహం

విగ్రహం పెట్టాక ఈ రాళ్ల దాడులు ఏంటి? సమస్యలు ఉంటే సామరస్యంగా పరుష్కరించాల్సిన పోలీసులు బూతులు మాట్లాడటం..

Bandi Sanjay On Bodhan : ఛత్రపతి శివాజీ విగ్రహం ఎందుకు పెట్టొద్దు? బోధన్ ఘటనపై బండి ఆగ్రహం

Bandi Sanjay

Bandi Sanjay On Bodhan : నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఓ వర్గం వారు విగ్రహ ప్రతిష్టాపన చేయగా, మరో వర్గం వారు వ్యతిరేకించారు. బీజేపీ, శివసేనకు చెందిన వారు విగ్రహం ఏర్పాటు చేశారంటూ మైనారిటీ వర్గానికి చెందిన వారు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల వారు మోహరించగా.. అలర్ట్ అయిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అయితే, ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసరడంతో, పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.

ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. బోధన్ లో హిందూ వాహిని, భజరంగ్ దళ్ నేతలపై దాడిని ఆయన ఖండించారు. ఎంఐఎం, టీఆర్ఎస్ ముస్లిం నేతలు, పోలీసులు కలిసి ఈ దాడికి పాల్పడ్డారని బండి సంజయ్ ఆరోపించారు. బోధన్ లో శివాజీ విగ్రహ స్థాపన కోసం మున్సిపాలిటీ తీర్మానం కూడా చేసిందని బండి సంజయ్ స్పష్టం చేశారు. సీపీపైనా ఆయన ఫైర్ అయ్యారు. సీపీ బూతులు తిట్టి లాఠీచార్జి చేశారని మండిపడ్డారు. సీపీ ఓ రౌడీలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

”విగ్రహం పెట్టాక ఈ రాళ్ల దాడులు ఏంటి? సమస్యలు ఉంటే సామరస్యంగా పరుష్కరించాల్సిన పోలీసులు బూతులు మాట్లాడటం, లాఠీచార్జి చేయడం ఘోరం. రబ్బరు బుల్లెట్లతో దాడులు, లాఠీచార్జి చేశారు. ఇదే సీపీ గతంలో ఎంపీ చాన్స్ ఇచ్చారని అన్నాడు. నువ్వు సీపీవా? గూండావా.? హనుమాన్ భక్తులపై దాడి చేస్తావా? ఛత్రపతి శివాజీ ఏమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చాడా? ఎందుకు అడ్డుకున్నారు?

రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని కేసీఆర్ అంటున్నారు. మరి లాఠీచార్జి, రబ్బర్ బుల్లెట్లు ఎలా వచ్చాయి? ముఖ్యమంత్రి మోచేతి నీళ్లు తాగి అధికారులు దాడులు చేస్తున్నారు. సీఎంతో శభాష్ అనిపించుకునేందుకు సీపీ తహతహలాడుతున్నారు. చట్టాన్ని కాపాడలేని నీలాంటోళ్లు వెళ్లి వేరే పని చేసుకోవాలి. నీకు పోలీస్ ఉద్యోగం ఎందుకు? హోంమంత్రికి అసలు ఈ విషయం తెలుసో లేదో? రోహింగ్యాలకు రిబ్బన్ కట్ చేయడం మాత్రం హోంమంత్రికి తెలుసు. భైంసా సమయంలోనూ స్పందించ లేదు. ఇప్పుడు కూడా స్పందించరు. ఫ్రెండ్లీ పోలీస్ అనేది నిజమే. కానీ, టీఆర్ఎస్ నేతలకు మాత్రమే. బీజేపీ కార్యకర్తలకు మేము అండగా ఉంటాం. ఎవరూ భయపడొద్దు. సీపీపై చర్యలు తీసుకోవాలి” అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

మరోవైపు సోమవారం బోధన్ బంద్ కు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. బోధన్ లో శివాజీ విగ్రహ వివాదం, హనుమాన్ స్వాములపై దాడికి నిరసనగా బంద్ కు పిలునిచ్చారు. ఈ బంద్ కు విద్యా సంస్థలు, వాణిజ్య సంస్థలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.