TG Venkatesh Land Grab : బంజారాహిల్స్ భూకబ్జా కేసు.. బీజేపీ ఎంపీకి బిగ్ రిలీఫ్ | Banjara Hills Land Grab Case Police Remove MP TG Venkatesh Name From Chargesheet

TG Venkatesh Land Grab : బంజారాహిల్స్ భూకబ్జా కేసు.. బీజేపీ ఎంపీకి బిగ్ రిలీఫ్

TG Venkatesh Land Grab : బంజారాహిల్స్ భూకబ్జా కేసు.. బీజేపీ ఎంపీకి బిగ్ రిలీఫ్

TG Venkatesh Land Grab : హైదరాబాద్ బంజారాహిల్స్ భూకబ్జా కేసులో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ కు బిగ్ రిలీఫ్ లభించింది. భూకబ్జా కేసు నుంచి ఆయన పేరుని పోలీసులు తొలగించారు. ఈ కేసుపై దర్యాఫ్తు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. టీజీ వెంకటేశ్ ప్రమేయం లేదని నిర్ధారించారు. దీంతో కేసు నుంచి ఆయన పేరుని తొలగించారు. గతంలో ఎఫ్ఐఆర్ లో టీజీ పేరుని ఏ-5గా చేర్చారు పోలీసులు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరిపిన పోలీసులు టీజీ ప్రమేయం లేదని తేల్చారు. అనంతరం ఆయన పేరుని చార్జ్ షీట్ నుంచి తొలగించారు.

బంజారాహిల్స్ లో ల్యాండ్ కబ్జా కేసు సంచలనం రేపింది. ఈ కేసులో మొత్తం 80 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. సుమారు రూ. 100 కోట్లు భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ జెమ్స్, జువెలర్స్ కు చెందిన భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. JCB లు, హాకీ స్టిక్స్, సీసీ కెమెరాలతో 80 మంది ఈ భూమిలోకి ప్రవేశించారు. ఏపీ జెమ్స్ ప్రాపర్టీస్ ను ధ్వంసం చేసేందుకు ప్లాన్ చేశారు.

బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లో రెండున్నర ఎకరాల భూమిని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2005 లో ఏపీ జెమ్స్ అండ్ జువెలర్స్ పార్క్ కు ఇచ్చింది అప్పటి ప్రభుత్వం. అందులో దాదాపు రెండు ఎకరాల్లో ఆ కంపెనీ అభివృద్ధి పనులు చేయగా.. మిగతా స్థలం ఖాళీగా ఉంది. మార్కెట్‌ లెక్కల ప్రకారం ఈ స్థలం విలువ దాదాపు వంద కోట్లు ఉంటుందని అంచనా. ఈ ల్యాండ్‌ తమదే అంటూ సిటీకి చెందిన వీవీఎస్‌ శర్మ వాదిస్తున్నారు.(TG Venkatesh Land Grab)

Hyderabad : బంజారా హిల్స్ కబ్జా స్ధలం.. కధా కమామీషు

లిటిగేషన్‌లో ఉన్న ల్యాండ్‌ గురించి తెలిసిన టీజీ వెంకటేశ్‌ సోదరుడి కుమారుడు విశ్వప్రసాద్‌.. ఈ ల్యాండ్‌పై కన్నేశాడు. ఆ వ్యక్తితో డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ స్థలాన్ని ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించి విఫలం అయ్యాడు. సమయం చూసి తన బ్యాచ్‌తో అక్కడ వాలిపోయాడు. సీమ నుంచి మనుషుల్ని దించి కబ్జా చేసేశాడు. ఈ స్థలం విషయంలో గతంలోనూ వివాదాలు జరిగాయి. కేసులు కూడా నమోదయ్యాయి.

ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు దాదాపు 10 వాహనాల్లో కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందిన 90 మంది మారణాయుధాలతో అక్కడికి చేరుకుని సెక్యూరిటీపై దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకోగా, వారిని గమనించిన కొందరు వాహనాల్లో పరారయ్యారు. 90 మందిలో 63 మందిని అరెస్ట్ చేసి ఆయుధాలు, వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారందరిని భద్రత మధ్య కోర్టుకు తరలించారు. ఈ వ్యవహారంలో ఎంపీ టీజీ వెంకటేష్, విశ్వ ప్రసాద్, వీవీఎస్ శర్మ తదితర 15 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఏ-5గా టీజీ వెంకటేశ్‌, ఏ-1గా టీజీ విశ్వప్రసాద్‌ను పేర్కొన్నారు.

రూ. వంద కోట్ల విలువైన భూమి విషయంలో కొంతమంది గొడవకు దిగిన ఘటనలో తనపై కూడా కేసు నమోదు కావడం పట్ల టీజీ వెంకటేశ్ తీవ్రంగా స్పందించారు. బంజారాహిల్స్ భూ వివాదంతో తనకెలాంటి సంబంధం లేదని మొదటి నుంచి వాదిస్తున్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు తాను లక్ష ద్వీప్‌లో ఉన్న సమయంలో భూ వివాదం గురించి తెలిసిందన్నారు. మొదట పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేదని.. కానీ తర్వాత రిమాండ్ రిపోర్టులో తన పేరు పెట్టారన్నారు. ఆ భూమికి తనకు ఎలాంటి సంబందం లేదని టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు.

Hyderabad : బంజారాహిల్స్ లో రూ.100కోట్ల స్ధలం కబ్జాకు యత్నం

బంజారాహిల్స్ భూ వివాదం విషయంలో రెండు వర్గాల మధ్య చాలా కాలంగా గొడవ నడుస్తోందన్నారు. ఈ వివాదంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు టీజీ విశ్వప్రసాద్. ఆయన తన దూరపు బంధువని టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. టీజీ అనే పేరుతో చాలామంది బంధువులు ఉన్నారని… అంత మాత్రాన వారు చేసే అన్ని పనుల్లో తనకు భాగస్వామ్యం ఉంటుందా అని ప్రశ్నించారు. అలాగే టీజీ విశ్వప్రసాద్ సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారని అందులో తాను భాగస్వామిని కాదని.. టీజీ అని పేరున్నంత మాత్రాన తనకేం సంబంధం ఉంటుందని టీజీ వెంకటేష్ ప్రశ్నించారు. బంజారాహిల్స్‌ ల్యాండ్ వివాదంతో తనకెలాంటి సంబంధం లేదని టీజీ వెంకటేష్ పదే పదే స్పష్టం చేశారు. టీజీ అనే పేరు ఉన్నంత మాత్రాన టీజీ వెంకటేష్ ను వివాదంలోకి లాగడం అవివేకమని మండిపడ్డారు. మా వంశీయులు ఎందరో టీజీ అనే పేరుతో కొనసాగుతున్నారని ఆయన గుర్తు చేశారు.

×