పూల జాతరకు వేళాయే, తెలంగాణలో బతుకమ్మ సంబరాలు

  • Published By: madhu ,Published On : October 16, 2020 / 09:49 AM IST
పూల జాతరకు వేళాయే, తెలంగాణలో బతుకమ్మ సంబరాలు

Bathukamma celebration in Telangana : బతుకమ్మ పండుగకు తెలంగాణ రాష్ట్రం ముస్తాబైంది. పూల జాతరకు వేళయింది. 2020, అక్టోబర్ 16వ తేదీ నుంచి సంబరాలు స్టార్ట్ కానున్నాయి. కరోనా నేపథ్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడానికి మహిళలు సిద్ధమయ్యారు. దేశంలో తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ రాష్ట్ర సాధనలోనూ ఉద్యమ స్ఫూర్తిని నింపింది.



శుక్రవారం ఎంగిలిపూల బతుకమ్మతో సంబురాలు మొదలు కానున్నాయి. 9 రోజుల పాటు వేడుకలను జరుపుకోనున్నారు. పెత్తర మాసంతో ప్రారంభమై.. దుర్గాష్టమితో ముగిసే నవరాత్రుల పండుగ ఇది. బతుకమ్మ అంటే మహిళలే కాదు ప్రకృతి కూడా పుకలరిస్తుంది. ఒక్కొక్క రోజున ఒక్కొక్క రూపంలో బతుకమ్మను పేరుస్తారు.



పూలను కొలుస్తూ కీర్తించడాన్ని బతుకమ్మ సంస్కృతి అని అభివర్ణిస్తున్నారు. తంగేడు.. బీర.. గన్నేరు.. నిత్యమల్లె.. బంతి.. చేమంతి లాంటి పూలతో బతుకమ్మలను అందంగా పేర్చుతారు. సాంస్కృతికంగా బతుకమ్మ పండుగ తెలంగాణకు కుంభమేళా లాంటిదని అంటారు.



మహాలయ అమవాస్య నుంచి చిన్న బతుకమ్మలతో సంబరాలు మొదలై పెద్ద బతుకమ్మతో ముగుస్తాయి. సద్దుల (పెద్ద) బతుకమ్మ అక్టోబరు 24న అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు. ప్రకృతిలో సేకరించిన పూలను ప్రకృతికే సమర్పించడం అనే ఉద్దేశంతో బతుకమ్మలను నీటిలో విడిచపెడతారు. ఈసారి కూడా..బతుకమ్మ సారెను రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్న సంగతి తెలిసిందే.