Heavy Rain Alert : బయటకు రావొద్దు.. తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు

తెలంగాణవ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. మరో 3 రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

Heavy Rain Alert : బయటకు రావొద్దు.. తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు

Heavy Rain Alert

Heavy Rain Alert : తెలంగాణవ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. మరో 3 రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

తెలంగాణ ఇప్పటికే తడిసి ముద్దవుతోంది. ఎడతెరిపి లేకుండా ముసురు పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. దాని ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 2.48 సెంటీమీటర్ల సగటు వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 52శాతం అధికంగా వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్ లో వారం రోజులు వానలు పడుతున్నాయి. గ్రేటర్ పరిధిలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. వర్షం నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు వర్షం, మరోవైపు వరద నీరుతో నగరవాసులకు అవస్థలు తప్పడం లేదు. వాన నీరు ఇళ్లలోకి చేరడంతో కట్టుబట్టలతో ఖాళీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇప్పటికే రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా ఇరు రాష్ట్రాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. కుండపోత వర్షాలతో జూరాల, శ్రీశైలం, నాగార్జుసాగర్‌ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.

హైదరాబాద్‌లోని జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌ నిండుకుండలా మారాయి. హిమాయత్‌సాగర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో అడుగుమేర గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.