ఆఫర్లకు ఆశపడ్డారో, ఫ్రీ అని కక్కుర్తి పడ్డారో మీ బ్యాంకు ఖాతా ఖాళీ.. ఒక్క క్లిక్‌తో దోచేస్తారు

  • Published By: naveen ,Published On : October 30, 2020 / 11:35 AM IST
ఆఫర్లకు ఆశపడ్డారో, ఫ్రీ అని కక్కుర్తి పడ్డారో మీ బ్యాంకు ఖాతా ఖాళీ.. ఒక్క క్లిక్‌తో దోచేస్తారు

online cheatings: పండుగ సీజన్‌ వచ్చేసిందంటే.. కొత్త బట్టలు కొనుక్కోవాలని, బోనస్‌లు పడితే ఇంట్లోకి కొత్త వస్తువు తెచ్చుకోవాలని అనిపిస్తుంది. ఈ కరోనా టైంలో బయటికి వెళ్లి షాపింగ్‌ చేస్తే వైరస్‌ రూపంలో కొత్త బోనస్‌ వచ్చే ప్రమాదం ఉంది. అదేదో ఆన్‌లైన్‌లో కొనేద్దాం. ఆఫర్లు కూడా ఉంటాయని అనుకుంటాం. ఆ ఆఫర్లకు ఆశపడి, ఏ వెబ్‌సైట్‌ పడితే అది క్లిక్‌ చేశారో మీ బ్యాంక్‌ ఖాతా ఖాళీ అవుద్ది. నిజమేంటో, నకిలీ ఏంటో తెలియకుంటే నట్టేట మునిగిపోతారు.

ఒక్క ఫోన్‌ కాల్ తో మీ ఖాతా ఖాళీ:
ఉచితం పేరుతో ఆన్‌లైన్‌ మోసాలు.. స్మార్ట్‌ ఫోన్లు, ఆఫర్లు ఎర.. వెబ్‌ లింక్‌లను నమ్మితే ఖాతాలో సొమ్ము పోయినట్టే.. ఒక్క ఫోన్‌ కాల్‌.. తెలియకుండానే మీ జేబుకు కత్తెర పడుతుంది. మీ ఖాతా ఖాళీ అవుతుంది. నిల్‌ బ్యాలెన్స్‌ మెసేజ్‌ మీ సెల్‌ ఫోన్‌లో చేరిపోతుంది. పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. అమాయక జనం మోసపోతూనే ఉన్నారు. తెలియని వారికి ఓటీపీలు చెప్పి టోపీలు పెట్టించుకుంటున్నారు. ఇదే కాదు సైబర్‌ నేరగాళ్లు కొత్త కొత్త రూట్లలో జనాన్ని కొల్లగొడుతున్నారు. కంప్యూటర్‌ ముందు కూర్చొని ఖాతాలన్నీ ఖాళీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఖాతాదారుల్లో పావుశాతం మంది ఏదో రకంగా సైబర్‌ మోసానికి గురైనవారే అని లెక్కలు చెబుతున్నాయి.

ఆన్‌లైన్‌ వేదికగా బోగస్ వెబ్‌సైట్లతో హైటెక్‌ చోరీలు:
జనం అప్‌డేట్‌ అవుతుంటే.. నేరగాళ్లు మరింత తెలివి మీరుతున్నారు. డిజిటల్‌ ప్రపంచంలో డిగ్నిటీగా కలరింగ్‌ ఇస్తూ ఖాతాలకు కన్నాలు వేస్తున్నారు. చిన్న ఫోన్‌ కాల్‌తో జేబులకు చిల్లులు పెట్టేస్తున్నారు. కరోనా టైంలో డిజిటల్‌ లావాదేవీలు ఎక్కువయ్యాయి. బ్యాంకులు కూడా ఖాతాదారులను అటువైపుగానే ప్రోత్సహిస్తున్నాయి. జనం కూడా సులువుగా పని అయిపోతుందనే నమ్మకంతో.. ప్రతి పనికి ఆన్‌లైన్‌ చెల్లింపులే చేస్తున్నారు. ఇదే అదునుగా.. సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్‌ వేదికగా బోగస్ వెబ్‌సైట్లతో హైటెక్‌ చోరీలకు పాల్పడుతున్నారు.

మెయిల్స్‌ ద్వారా కూడా బ్యాంక్ అకౌంట్స్‌ హ్యాక్‌:
ఇక మెయిల్స్‌ ద్వారా కూడా అకౌంట్స్‌ను హ్యాక్‌ చేస్తున్న బ్యాచ్‌లు తయారయ్యాయి. ఈ నేరగాళ్లు మన మెయిల్‌కు ఒక మెసేజ్‌ పంపిస్తారు. అది అచ్చంగా బ్యాంకు నుంచి వచ్చినట్లు నమ్మేలా ఉంటుంది. అందులో ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయండి.. భారీ బహుమతులు సొంతం చేసుకోండంటూ ఒక లింక్‌ను పోస్ట్‌ చేస్తారు. అది నమ్మి లింక్‌ ఓపెన్‌ చేశామా.. మన అకౌంట్‌ హాంఫట్‌ అయినట్టే. లింక్‌ను ఓపెన్‌ చేసి మన ఖాతా వివరాలన్నీ ఇచ్చాక.. పేజ్‌ ఓపెన్‌ కాదు. సరేలే అనుకొని మనం ఊరుకున్నామా.. ఏదో అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న మనకు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసినందుకు ధన్యవాదాలు అంటూ మెసేజ్‌ వస్తుంది. అది చూసి బిత్తరపోవడం మన వంతవుతుంది.

డిస్కౌంట్లకు కక్కుర్తి పడొద్దు:
వివిధ రకాల ఆన్‌లైన్‌ పోర్టల్స్‌లో వినియోగదారులు ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుంటారు. ఆ సమయంలో వారు ఆ పోర్టల్‌లో చూసే పేజీల్లో ఈ ప్రకటనలు కన్పిస్తుంటాయి. 50% డిస్కౌంట్, 70% డిస్కౌంట్, 90% డిస్కౌంట్ అంటూ ఆకర్షిస్తుంటారు. అది చూడగానే మనలో అత్యాశ అటుగా లాగుతుంది. వెంటనే క్లిక్ చేస్తారు. అంతే బ్యాంకు ఖాతా ఖాళీ చేసుకొని బిత్తర మొఖం వేయాల్సి ఉంటుంది.

లింక్ ను క్లిక్ చేసే ముందు బీ కుర్ ఫుల్:
అదే ఒకసారి ఆ లింక్‌ను క్లిక్ చేసే ముందు ఆలోచిస్తే.. మీ సొమ్మును కాపాడుకున్న వారు అవుతారు. ఎందుకంటే అసలు ఆ వెబ్‌సైట్ నకిలీదా? లేక ఒరిజినల్‌దా? అని ఆలోచిస్తారు. అప్పుడు ఆ వస్తువుకు ఎందుకంత డిస్కౌంట్ ఇస్తున్నారో కూడా అర్థమైపోతుంది. ఏదో గిఫ్ట్ వోచర్ వస్తుందని.. డిస్కౌంట్ ఇస్తున్నారని అత్యాశకు పోయి కొందరు నేరగాళ్ల వలలో చిక్కుకొని భారీగా డబ్బులు పొగొట్టుకుంటున్నారు.