Bhadradri : భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణం.. మిథిలా స్టేడియంలో భారీ ఏర్పాట్లు

దక్షిణాది అయోధ్యగా పేరు పొందిన ప్రముఖ పుణ్య క్షేత్రం భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

Bhadradri : దక్షిణాది అయోధ్యగా పేరు పొందిన ప్రముఖ పుణ్య క్షేత్రం భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. స్వామి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు మార్చి 26న ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా గురువారం సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మార్చి 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరుగనుంది. సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు, అర్చకులు మిథిలా స్టేడియంలో కల్యాణ వేదికను సిద్ధం చేశారు.

గురువారం ఉదయం 9.30 గంటలకు కల్యాణ మూర్తులను వేద మంత్రోచ్చారణల నడుమ మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి తీసుకు రానున్నారు. ఉదయం 10.30 నుంచి కల్యాణ తంతు ప్రారంభం కానుంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్న సుమూహుర్తాన కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. భద్రచాలంలో జరిగే సీతారాముల కల్యాణానికి దేశం నలుమూలల నుంచి లక్షమందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకనుగునంగా ఏర్పాట్లు చేశారు.

Sri Rama Navami : భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభం.. ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం

కరోనా కారణంగా 2020 నుంచి 2022 వరకు స్వామి కల్యాణాన్ని రామాలయానికే పరిమితం చేశారు. మూడేళ్ల తర్వాత మిథిలా కల్యాణ మండపంలో స్వామి వారి కల్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం 200 క్వింటాళ్లతో ముత్యాల తలంబ్రాలు సిద్ధం చేశారు. రాములోరి కల్యాణం తర్వాత ముత్యాల తలంబ్రాలను అందించేందుకు 70 ప్రత్యేక కౌంటర్లను సిద్ధం చేశారు. స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని 2 లక్షల మందికి సరిపడేలా రెడీ చేశారు. కల్యాణానికి హాజరయ్యే భక్తుల దాహర్తిని తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో మంచినీటి ప్యాకెట్లు, మజ్జిగా అందిచనున్నారు.

భద్రాచలం పట్టణంలోని ప్రధాన కూడళ్లల్లో చలి వేంద్రాలు ఏర్పాటు చేశారు. భద్రాద్రి రామయ్య కల్యాణానికి వచ్చే భక్తులను కనువిందు చేసేలా జిల్లాలోని ప్రధాన కూడళ్లల్లో భారీ స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా శామియానాలు, చలువ పందిళ్లు రెడీ అయ్యాయి. కల్యాణానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.

Vaikuntha Ekadashi : భద్రాద్రిలో తెరుచుకున్న శ్రీరాముడి వైకుంఠ ద్వారాలు

రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అళ్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. కల్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కల్యాణ మహోత్సవం జరిగిన మరునాడు రామయ్యకు పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితిగా వస్తోంది. దీనిలో భాగంగా శుక్రవారం 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే పుష్కర మహా పట్టాభిషేకం జరుగనుంది.

సీతారాముల కల్యాణ మహోత్సవానికి సీఎం కేసీఆర్ కోటి రూపాయల ప్రత్యేక నిధులు కేటాయించారు. ఈ నిధులతో ఆలయ అధికారులు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆదేశాల మేరకు ఎస్పీ వినీత్ ఆధ్వర్యలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ ఐలు ఆరు వేల మంది సిబ్బందితో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు