భారత్ బయోటెక్‌ కరోనా వ్యాక్సిన్, రెండో దఫా క్లినికల్ ట్రయల్స్‌కు రెడీ

  • Published By: naveen ,Published On : August 1, 2020 / 01:21 PM IST
భారత్ బయోటెక్‌ కరోనా వ్యాక్సిన్, రెండో దఫా క్లినికల్ ట్రయల్స్‌కు రెడీ

యావత్‌ ప్రపంచం కరోనాకు వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికే వ్యాక్సిన్‌ తయారీలో నిమగ్నమయ్యాయి. రష్యా ఈ నెలలోనే(ఆగస్టు) వ్యాక్సిన్‌ను తీసుకొస్తామని ప్రకటించింది. ఇక అమెరికా కూడా సెప్టెంబర్ లో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతోంది. మరికొన్ని దేశాల్లో టీకా పరిశోధనలు చివరి దశకు చేరుకున్నాయి. హ్యుమన్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నాయి.



టీకా ప్రయోగాల్లో భారత్‌ బయోటెక్‌, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ :
భారత్‌లోనూ కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రయోగాలు కొనసాగుతున్నాయి. భారత్‌ బయోటెక్‌ కంపెనీ వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో ముందుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను పూర్తి చేసింది. ఈ రెండో దఫా క్లినికల్‌ ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు భారత్‌ బయోటెక్‌ రెడీ అయ్యింది. తెలంగాణలో సెకండ్‌ ఫేజ్‌లో నిర్వహించే క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం 60మందికిపైగా స్వచ్చందంగా వచ్చారు.

43మందికి కోవ్యాక్సిన్‌ టీకా, నిలకడగా వాలంటీర్స్‌ ఆరోగ్యం:
క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం వచ్చిన 60 మందిలో 43 మందికి కోవ్యాక్సిన్‌ టీకా ఇచ్చారు. క్లినికల్‌ ట్రయల్స్‌కు వచ్చిన వారిలో 90శాతం మంది ఆరోగ్యం నిలకడగా ఉంది. మిగతా పది శాతం మంది కోసం నడుస్తున్న ప్రక్రియ వేగవంతం చేశారు.



క్లినికల్‌ ట్రయల్స్‌లో 3వ స్థానంలో నిమ్స్‌:
దేశంలో నిర్వహిస్తున్న క్లినికల్‌ ట్రయల్స్‌లో హైదరాబాద్‌ నిమ్స్‌ మూడో స్థానంలో ఉంది. టీకా ఇచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు గమనిస్తున్నారు. రెండు రోజుల క్రితం పది మందికి కోవ్యాక్సిన్‌ ఇచ్చారు. మరికొంత మందికి క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా.. కో వ్యాక్సిన్‌ టీకా ఇవ్వనున్నారు. దేశ వ్యాప్తంగా 375 కేంద్రాల్లో ట్రయల్స్‌ కొనసాగుతున్నా… మన దగ్గర మాత్రం అందరికంటే కొంత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. త్వరలోనే మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కూడా ప్రారంభం అయ్యే అవకాశముంది. ఈ ట్రయల్స్‌ సక్సెస్‌ అయితే.. భారత్ బయోటెక్‌ అందిస్తోన్న కోవ్యాక్సిన్‌ టీకా త్వరగా వచ్చే అవకాశముంది.