చార్మినార్ వద్ద భోగీ మంటలు…పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

చార్మినార్ వద్ద భోగీ మంటలు…పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

Bhogi fires at Charminar..Participating mlc kavaitha : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఇవాళ భోగిని పురస్కరించుకొని ముగ్గులు వేసి తెల్లవారుజామునే భోగి మంటలను వెలిగించారు ప్రజలు. కాలనీలు, అపార్ట్‌మెంట్లలో పాత సామాన్లు ఆ భోగి మంటల్లో వేస్తూ సరికొత్త సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నారు.

మంటల చుట్టూ నృత్యాలు చేస్తూ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ పండుగను జరుపుకుంటున్నారు. మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో అందరికీ భోగి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సంక్రాంతి అందరి ఇళ్లలో సంతోషాన్ని నింపాలని అందరూ కోరుకుంటున్నారు.

సంక్రాంతి తెలుగు లోగిళ్ళల్లో పెద్ద పండగ. చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా కుటుంబం అంతా ఒక్కటై చేసుకునే పండగ. కుటుంబ సభ్యుల కోలాహలం, గంగిరెద్దుల ఆటలు, చిన్నారులకు భోగి పళ్ళు, ఆడపిల్లల కోలాటాల సందడి, చుక్కల ముగ్గులు, కొత్తబట్టలు మూడు రోజుల ముచ్చటైన పండగ సంక్రాంతి.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద భోగి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. గంగిరెద్దులు, సాంప్రదాయ కళారూపాలు, సాంస్కృతిక కళారూపాలతో చార్మినార్ ప్రాంతంలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఎమ్మెల్సీ కవిత భోగి మంటలు వెలిగించి భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు.