భూమా అఖిల ప్రియ – ఏవీ సుబ్బారెడ్డిలు భూ దందాలు కలిసే చేస్తున్నారా ? కీలక విషయాలు

భూమా అఖిల ప్రియ – ఏవీ సుబ్బారెడ్డిలు భూ దందాలు కలిసే చేస్తున్నారా ? కీలక విషయాలు

Bhuma Akhila Priya – AV Subba Reddy : తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ‘బోయిన్ పల్లి కిడ్నాప్’ కేసు సంచలన మలుపు తిరిగింది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టయిన ఈ వ్యవహారంలో.. ఆమె ప్రత్యర్థి ఏవీ సుబ్బారెడ్డి కీలక నిందితుడని తేలింది. కొన్నాళ్లుగా నిప్పూఉప్పులా పొట్లాడుకుంటోన్న అఖిల -ఏవీలు భూదందాలను మాత్రం కలిసే చేస్తున్నారా? అనే అనుమానాలకు తావిచ్చేలా హైదరాబాద్ పోలీసులు కీలక విషయాలను బయటపెట్టారు. ఈ వ్యవహారంలో ఏపీ సర్కారు సహాయం కూడా తీసుకుంటున్నట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు.

ముగ్గురు సోదరుల కిడ్నాప్ : –
ముగ్గురు సోదరులు ప్రవీణ్ రావు, నవీన్ రావు, సునీల్‌ రావులు బోయిన్ పల్లిలో కిడ్నాప్‌నకు గురయ్యారు. ఐటీ అధికారులమంటూ ప్రవీణ్ రావు ఇంట్లోకి చొరబడ్డ కిడ్నాపర్లు.. గంటపాటు సోదాలు చేస్తున్నట్లు నటించి, ముగ్గురు సోదరులను కారులో అపహరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సినీ ఫక్కీలో ఛేజ్ చేసి కిడ్నాపర్లను పట్టుకున్నారు. కిడ్నాప్ కేసు వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. ఈ కేసులో ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ పేర్లున్నాయని సీపీ చెప్పారు.

సుబ్బారెడ్డి, అఖిల ప్రియ, ఇతరుల హస్తం : –
కృష్ణ రెసిడెన్సీ నుంచి కిడ్నాప్ వ్యవహారం మొదలైందని…. హఫీజ్ పేట్ ల్యాండ్ విషయంలో గతేడాది నుంచి జరుగుతోన్న వివాదమే కిడ్నాప్‌నకు దారి తీసిందన్నారు. ఐటీ అధికారుల్లా ఫేక్ సెర్చ్ వారెంట్‌తో కిడ్నాపర్లు.. బాధితుడైన ప్రవీణ్ రావు ఇంట్లోకి వెళ్లారన్నారు. ఈ కేసులో ఏవీ నాగిరెడ్డి, భూమా అఖిల ప్రియ, భార్గవ్ రామ్ ప్రమేయం ఉందనడానికి పక్కా ఆధారాలు లభించాయని తెలిపారు. హఫీజ్ పేట్ భూ వివాదంపై గతేడాది సెప్టెంబర్‌లోనే ఓ కేసు నమోదైనట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. భూవివాదంలో ఏవీ సుబ్బారెడ్డిపై ప్రవీణ్‌రావు గతంలో ఫిర్యాదు చేశాడరన్నారు. తాజా కిడ్నాప్‌ ఘటనలోనూ సుబ్బారెడ్డి, అఖిలప్రియ సహా ఇతరుల ప్రమేయం కూడా ఉన్నట్లు తేలిందన్నారు. ఇప్పటికే కొందరిని అరెస్టు చేయగా, మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ పోలీసుల సాయంతో మిగతా నిందితులను కూడా అరెస్టు చేస్తామని సీపీ అంజనీ తెలిపారు. కిడ్నాప్‌ కేసును మూడు గంటల్లోనే ఛేదించినట్లు సీపీ పేర్కొన్నారు.