బెయిల్ వచ్చింది..భూమా అఖిల ప్రియ కేసుపై స్పందిస్తారా

బెయిల్ వచ్చింది..భూమా అఖిల ప్రియ కేసుపై స్పందిస్తారా

Bhuma Akhila Priya : తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో ఇదే కేసులో అదనపు సెక్షన్లు నమోదు చేసిన నేపథ్యంలో.. వాటిని కొట్టివేసింది. రెండోసారి బెయిల్ పిటీషన్‌ను సవాల్ చేసుకోవడంతో ఎట్టకేలకు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సెషన్స్ కోర్టు. 10 వేల రూపాయల పూచీకత్తుతో ఇద్దరు షూరిటీలను కోర్టుకు సమర్పించాలని కోర్టు కండీషన్ పెట్టింది. 17 రోజులుగా జైలు జీవితం గడుపుతున్న అఖిల 2021, జనవరి 23వ తేదీ శనివారం విడుదల అవుతారా..? విడుదలైన తర్వాత కేసుపై స్పందించే అవకాశం ఉందా..?

బోయిన్‌పల్లి పోలీసులకు అఖిలప్రియ అందుబాటులో ఉండాలంటూ ఆర్డర్‌లో పేర్కొంది కోర్టు. రెండు వారాలకోసారి ప్రతి సోమవారం పోలీసుల ముందు హాజరు కావాలనే షరుతులతో కూడిన బెయిల్ ఇచ్చిది. ఇదే కేసులో పరారీలో ఉన్నా A3 భార్గవ రామ్ ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. గత విచారణలో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కోర్టు అదేశాల మేరకు కౌంటర్ కాపీలు దాఖలు చేశారు పోలీసులు.
బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో భార్గవ రామ్ కీలకమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. భార్గవ రామ్ బెయిల్‌పై బయటకు వస్తే కేసును ప్రభావితం చేస్తారని కోర్టు తెలిపారు పోలీసులు. మరోవైపు భార్గవ రామ్‌కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని అతని తరపు న్యాయవాదులు వాదించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకుని.. భార్గవ రామ్‌ ముందస్తు బెయిల్ పిటీషన్‌ను కొట్టివేసింది. ఇక మరోవైపు ఇదే కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసిన జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణకు సోమవారానికి వాయిదా వేసింది సికింద్రాబాద్ కోర్ట్. బోయిన్‌పల్లి కేసులో కీలక నిందితురాలుగా ఉన్న టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. చంచల్ గూడ జైల్లో ఉన్న అఖిల ప్రియ శనివారం బెయిల్‌పై విడుదలయ్యే అవకాశం ఉంది. బెయిల్‌పై విడుదలైన తర్వాత ఈ కేసుపై ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.