బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు : బెయిల్ ఇవ్వాలన్న భూమా అఖిల ప్రియ, న్యాయం జరుగుతుందన్న మౌనికా రెడ్డి

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు : బెయిల్ ఇవ్వాలన్న భూమా అఖిల ప్రియ, న్యాయం జరుగుతుందన్న మౌనికా రెడ్డి

Bhuma Akhila Priya bail petition : బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌రావు అండ్ బ్రదర్స్ కిడ్నాప్‌ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని పోలీసులు విచారించి వదిలేశారు. ఏ2గా ఉన్న అఖిలప్రియను జైలుకు తరలించారు. అఖిలప్రియ తరపు న్యాయవాది ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై 2021, జనవరి 07వ తేదీ గురువారం సికింద్రాబాద్‌ కోర్టులో విచారణ జరుగనుంది. కిడ్నాప్‌తో తన సోదరికి ఎలాంటి సంబంధం లేదన్నారు అఖిలప్రియ సిస్టర్‌ భూమా మౌనికారెడ్డి. తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ కేసులో ఏ2 నిందితురాలిగా ఉన్న అఖిల ప్రియను బుధవారం రాత్రే పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. దీంతో పోలీసులు ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

కీలక పరిణామం : –
హైదరాబాద్‌ బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని పోలీసులు వదిలిపెట్టారు. కిడ్నాప్‌ వ్యవహారంలో ఆయనపాత్రపై పోలీసులు స్టేషన్‌లోనే విచారించారు. అయితే తనకు, కిడ్నాప్‌నకు ఎలాంటి సంబంధం లేదని ఏవీ సుబ్బారెడ్డి పోలీసులకు స్పష్టం చేశారు. తనను చంపించేందుకు సుపారీ ఇచ్చిన భూమా అఖిలప్రియతో తానెలా కిడ్నాప్‌కు ప్లాన్‌ చేస్తానని అన్నారు. భూమా అఖిలప్రియకు, తనకు కొన్నాళ్లుగా మాటలు లేవని…ఈ కిడ్నాప్‌ కేసులో తన ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. హఫీజ్‌పేట భూ వివాదం చాలా కాలంగా కొనసాగుతోందని.. భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత అందులో తల దూర్చలేదని విచారణలో తెలిపారు. దీంతో పోలీసులు ఆయనను 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి వదలిపెట్టారు. కిడ్నాప్‌ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరుకావాలన్నారు. త్వరలోనే ఆయన స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేసే అవకాశముంది. తన తండ్రిని పోలీసులు విడిచిపెట్టారని… తమకు ఈ కిడ్నాప్‌తో సంబంధం లేదని ఏవీ సుబ్బారెడ్డి కూతురు స్పష్టం చేశారు.

గాంధీ ఆసుపత్రిలో అఖిల ప్రియకు వైద్య పరీక్షలు : –
అంతకుముందు అఖిలప్రియను పోలీసులు ఆమె ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఆమెను బేగంపేటలోని పోలీస్‌ క్వార్టర్స్‌లో మూడు గంటల పాటు విచారించారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట రసూల్‌పుర పోలీస్‌లైన్‌ లోని లెర్నింగ్‌ సెంటర్‌కు తీసుకువచ్చారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెకు ఎలాంటి సమస్య లేదని వైద్యులు తేల్చారు. వైద్య పరీక్షలు పూర్తైన వెంటనే అఖిలప్రియను పోలీసులు రహస్యంగా తరలించారు. ఆ సమయంలో గాంధీ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వైద్య పరీక్షలు చేసి, రిపోర్ట్స్ వచ్చాక అఖిలప్రియను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు పోలీసులు.

పరారీలో అఖిల ప్రియ భర్త : –
మరోవైపు బోయిన్‌పల్లి కిడ్నాప్‌ వ్యవహారంలో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్‌ సహా మరికొందరికి ప్రమేయం ఉందని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. హఫీజ్‌పేట భూ వివాదం నేపథ్యంలో ఈ కిడ్నాప్‌ జరిగిందన్నారు. 10 మందితో కూడిన బృందం కిడ్నాప్‌ చేసిందని వెల్లడించారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా కేసును ట్రేస్‌ చేశామన్న సీపీ… ఏ1గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ2 భూమా అఖిలప్రియ, ఏ3గా భార్గవ్‌రామ్‌ను చేర్చినట్లు తెలిపారు. మరోవైపు.. అఖిల ప్రియ భర్త భార్గవ్‌రామ్ పరారీలోనే ఉన్నారు. దీంతో ఈ కేసులో పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.