పెద్ద పార్టీలు నన్ను అంటరానివాడిగా చూశాయి: బీహార్‌లో 5సీట్లు గెలిచిన అసదుద్దీన్ ఓవైసీ

  • Published By: vamsi ,Published On : November 11, 2020 / 07:39 AM IST
పెద్ద పార్టీలు నన్ను అంటరానివాడిగా చూశాయి: బీహార్‌లో 5సీట్లు గెలిచిన అసదుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్ ఎంపీ MP అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) నేతృత్వంలోని AIMIM పార్టీ తెలంగాణలోనే కాదు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలోనే బీహార్ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో విజయం సాధించింది. బీహార్ రాష్ట్రంలో మొత్తం 24 స్థానాల నుంచి ఎంఐఎం పార్టీ తమ అభ్యర్థులను బరిలో దింపగా.. ముస్లింల జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాలను టార్గెట్ చేసుకుని 5స్థానాల్లో విజయం సాధించారు.



కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుశ్వాహకు చెందిన ఆర్‌ఎల్‌ఎస్‌పీ, బీఎస్‌పీతో పొత్తు పెట్టుకొని ఈ ఎన్నికల్లో బరిలోకి దిగగా.. ప్రధానంగా సీమాంచల్ ప్రాంతంపై దృష్టి సారించింది ఓవైసీ పార్టీ. ఎంఐఎం, బీఎస్పీ, ఆర్‌ఎల్‌ఎస్పీ కలిసి.. గ్రాండ్‌ డెమొక్రటిక్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌‌గా ఏర్పడి, ఎన్నికల్లో మహాకూటమి విజయావకాశాలను దెబ్బతీసింది. ముస్లిం ఓటు బ్యాంకును చీల్చి మహాకూటమిని దెబ్బకొట్టింది. బీహార్ రాష్ట్రంలో 2019 ఉపఎన్నికల్లో మొట్టమొదటిసారిగా పోటీ చేసిన ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధించింది. ఇప్పుడు ఐదు స్థానాల్లో విజయం సాధించింది.



వాస్తవానికి మహాకూటమిలో ‘కీ’రోల్ పాటిస్తున్న RJDకి సంప్రదాయ ఓటు బ్యాంకు యాదవులతో పాటు ముస్లింలు.. అయితే ఈ ఎన్నికల్లో ఎంఐఎం వారి ఓట్లను బాగా చీల్చింది. ఐదు స్థానాల్లో గెలుపొందడమే కాకుండా.. చాలా స్థానాల్లో RJD ఓట్లను చీల్చింది. అంతిమంగా మహాకూటమికి ముఖ్యమంత్రి పీఠాన్ని దూరం చేసింది.



ఈ సంధర్భంగా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. బీహార్‌లో రాజకీయ పార్టీల ప్రతి నాయకుడిని వ్యక్తిగతంగా కలిశాను. ఎన్నికల ముందు మాతో కలవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. పెద్ద పార్టీల నాయకులు అందరూ నన్ను అంటరానివారిలా చూశారు. అయితే బీహార్‌లో మేం గట్టిగా నిలబడగలమని ముందే ఊహించాము అని ఓవైసీ అన్నారు. ఇక బీహార్ రాష్ట్రంలో ఏ పార్టీకి మద్దతు ఇస్తుందో AIMIM తరువాత నిర్ణయిస్తుందని ఓవైసీ చెప్పారు.



https://10tv.in/owaisis-mim-wins-5-seats-in-seemanchal-dents-mgb/
బీహార్ ప్రజలు మాకు ఓటు వేశారు. వారి ఆశీర్వాదాలు ఇచ్చారు. నేను వారికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు. మేము ప్రజల కోసం పని చేస్తాము. వరద ప్రభావిత ప్రాంతాలపై దృష్టి పెడతాము. మహమ్మారి ఉన్నప్పటికీ ప్రజలు బయటకు వచ్చి మాకు ఓటు వేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మేము కలిసి కూర్చుని సమస్యలపై పని చేస్తాము. రాబోయే ఎన్నికల్లో మరిన్ని సీట్లను గెలుచుకునేందుకు సిద్ధం అవుతాము అని అన్నారు. తన పార్టీని “ఓటు కట్టర్” అని పిలిచేవారికి ఈ ఎన్నికల్లో గట్టి సమాధానం లభించిందని ఓవైసీ అన్నారు.