రూ.60కే తిన్నంత బిర్యానీ..బాస్మతి రైస్, మినరల్ వాటర్

రూ.60కే తిన్నంత బిర్యానీ..బాస్మతి రైస్, మినరల్ వాటర్

Biryani for Rs 60 : హైదరాబాద్ లో బిర్యానీకి ఉన్నా క్రేజీ తెలియంది కాదు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఇష్టంగా తింటారు. పెద్ద పెద్ద హోటల్స్ లో బిర్యానీ తినాలంటే భారంగా ఉంది. కానీ ఇద్దరు అన్నదమ్ములు కేవలం రూ.60కే తిన్నంత బిర్యానీ పెడుతున్నారు. ఉప్పల్‌ చౌరస్తా నుంచి రామంతాపూర్‌కు వెళ్లే మార్గంలో తిన్నంత బిర్యానీ పాయింట్‌ కనిపిస్తుంది. ఒక్కో దాని ధర రూ.60. ఇష్టమున్నంత తినొచ్చు. అయితే ఇది పూర్తిగా శాకాహారం మాత్రమే.

బిర్యానీతోపాటు అదనంగా గ్రేవీ, సలాడ్‌, పెరుగు, స్వీట్‌, మినరల్‌ వాటర్‌ ఇస్తారు. నాలుగురోజుల క్రితమే దీన్ని ఏర్పాటు చేయగా..తొలిరోజు 20 ప్లేట్లవరకు విక్రయించారు. రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని అన్నదమ్ములు ఉదయ్‌, కిరణ్‌లు అంటున్నారు. తక్కువ ధర అని నాసిరకం కాకుండా బాస్మతి బియ్యాన్ని వినియోగిస్తున్నామని తెలిపారు. నిత్యం రూ.1000 నుంచి రూ.1,500 వరకు పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు.

ఉదయ్‌, కిరణ్‌ అన్నదమ్ములు. ఉదయ్‌ కాకతీయ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. తొలుత ఒక బట్టల షాప్ లో పదేళ్లపాటు మేనేజర్‌గా, ఆ తర్వాత రెస్టారెంట్‌లో పని చేశారు. అంతంత మాత్రమే జీతం వస్తుండడం, ఎదుగుదల లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కిరణ్‌ పదోతరగతి చదువుకున్నారు. రూ.15 వేల ప్రైవేటు ఉద్యోగం వదులుకొని ఇద్దరు కలిసి (స్టార్టప్‌) ‘తిన్నంత బిర్యానీ’ పాయింట్‌ ప్రారంభించారు.

ఉదయ్‌, కిరణ్‌ల తండ్రి చనిపోయారు. తల్లి దివ్యాంగురాలు. కుటుంబ భారమంతా వీరిద్దరిపైనే పడింది. జీవన పోరాటంలో ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యామని, ఈ ఒత్తిడిలోనుంచే బిర్యానీ ఆలోచన వచ్చిందన్నారు. రూ.1.70 లక్షలతో ఈ-రిక్షా కొన్నామని, తొలుత లాభాల గురించి కాకుండా వినియోగదారుల సంతృప్తే లక్ష్యంగా బిర్యానీ పాయింట్‌ ప్రారంభించినట్లు వెల్లడించారు.

బిర్యానీపై మోజు ఉన్నవారు తిన్నంత బిర్యానీని ఆదరిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఉప్పల్‌-రామంతాపూర్‌ మార్గంలో రూ.60 చెల్లించి ‘తిన్నంత బిర్యానీ’ పాయింట్‌లో తింటున్నామని, రుచిగా ఉందని పలువురు అంటున్నారు.