BJP vs TRS : బీజేపీ కి షాక్…కారు ఎక్కిన కమలం కార్పోరేటర్లు

హైదరాబాదులో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకుని టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని చెప్పుకునే యత్నం చేస్తున్న బిజెపికి  గులాబీ పార్టీ వరుసగా షాక్‌లు ఇస్తోంది.

BJP vs TRS : బీజేపీ కి షాక్…కారు ఎక్కిన కమలం కార్పోరేటర్లు

Bjp Vs Trs

BJP vs TRS : హైదరాబాదులో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకుని టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని చెప్పుకునే యత్నం చేస్తున్న బిజెపికి  గులాబీ పార్టీ వరుసగా షాక్‌లు ఇస్తోంది. బీజేపీకి చెందిన నలుగురు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపాలిటీ బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌కు   చెందిన ఇద్దరు కార్పొరేటర్లు, ఏడుగురు కౌన్సిలర్లు సహా వందల మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 200 వాహనాల్లో వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరారు. గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌, నందినగర్‌లో వేర్వేరు వేదికలపై పార్టీలో చేరిన వారికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ గులాబీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు.

జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు భానోత్‌ సుజాతా నాయక్‌ (హస్తినాపురం), పొడవు అర్చన ప్రకాశ్‌ (రాజేంద్రనగర్‌), డేరంగుల వెంకటేశ్‌ (జూబ్లీ హిల్స్‌), సునీతా ప్రకాశ్‌గౌడ్‌ (అడిక్‌మెట్‌) మంత్రి కేటీఆర్‌తో నందినగర్‌లోని నివాసంలో గురువారం భేటీ అయ్యారు. అనంతరం కార్పొరేటర్లకు గులాబీ కండువాలు కప్పి మంత్రి కేటీఆర్‌ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

ఇదిలా ఉంటే కల్వకుర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఏడుగురు కౌన్సిలర్లు, ఇద్దరు కో–ఆప్షన్‌ సభ్యులు భృంగి ఆనంద్‌ కుమార్‌ నేతృత్వంలో కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు రెండు రోజులు ముందుగా గ్రేటర్ హైదరాబాద్ బిజెపి కార్పొరేటర్లను టీఆర్‌ఎస్ కారెక్కించుకుంది. మరోవైపు ప్రజాక్షేత్రంలో బీజేపీ వైఖరిని గులాబీ నేతలు ఎండగడుతున్నారు. తెలంగాణ గడ్డ కెసిఆర్ అడ్డా అని ప్రకటనలు చేస్తున్నారు.

బీజేపీ కార్యవర్గ సమావేశాలు ఖరారైన నాటినుంచి గులాబీ పార్టీ పై దూకుడు పెంచిన కమలనాథులకు చెక్ పెట్టే విధంగా టిఆర్ఎస్ పావులు కదుపుతోంది. బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు సమాధానాలు ఇస్తూనే క్షేత్ర స్థాయిలో కమలం నేతలను ఆత్మరక్షణలో పడేసే విధంగా పావులు కదుపుతున్నారు. దాదాపు రెండు వారాల క్రితం సోషల్ మీడియాలో బై…బై మోడీ అనే నినాదాన్ని టీఆర్ఎస్ మొదలు పెట్టింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను జాతీయ స్థాయిలో ఎండగట్టే విధంగా ప్రణాళికలు అమలు చేస్తోంది.

రాష్ట్రంలో వారం రోజులుగా బీజేపీ నేతలను ఇరకాటంలో వేసే విధంగా పావులు కదుపుతూ కమల నాథులకు రోజుకో షాక్ అన్న చందంగా వ్యవహరిస్తోంది గులాబీ పార్టీ. బీజేపీ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్‌ను కాషాయ మయం చేయాలని బీజేపీ భావించినా…. అంతకు ముందుగానే టీఆర్‌ఎస్ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రచారం చేసేందుకు భారీ హోర్డింగ్ లను ఏర్పాటు చేసింది.

గ్రేటర్ పరిధిలో ని ప్రధాన రహదారులు, మెట్రో పిల్లర్ల పై ఎటూ చూసినా గులాబీ మయం అయ్యేలా కార్యచరణ అమలు చేసింది.ఆ తరువాత బీజేపీ లో చేరిన మాజీ మంత్రి ఈటల భూకబ్జా వ్యవహారంలో ఆ భూములను పేదలకు అందేలా పట్టాలు పంచి పెట్టింది. బీజేపీ నేతలు దీనిపై ఎక్కడా స్పందించలేని పరిస్థితులను అధికార పార్టీ కల్పించింది. ఈటల కుటుంబం కూడా గతంలో మా భూములని చెప్పుకున్నా ఆ భూములకు తమకు సంబంధం లేదని ఇప్పుడు ప్రకటించడం విశేషం.

New Project (5)

గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్‌తో పోటీ పడుతూ తాము కార్పొరేటర్ స్థానాలను సాధించామని చెప్పుకున్న కమలనాథులు అదే జోష్ లో ప్రధాని మోడీతో ఇటీవలే గ్రేటర్ కార్పొరేటర్లు కలిసి వచ్చారు. ఇక తెలంగాణలో భవిష్యత్తు మీదే అని మోడీ కూడా కార్పొరేటర్లకు భరోసా ఇచ్చారు. మూడు వారాలు తిరగకముందే కాషాయ దళంలోని నలుగురు కార్పొరేటర్లు అనూహ్యంగా కారెక్కారు.

కమలం పార్టీ జాతీయ నేతలంతా పార్టీని పటిష్టపరిచేందుకు రాష్ట్రానికి వస్తుంటే….స్థానిక నేతలు పార్టీని వీడుతుండడం కమలనాథుల్లో కొత్త చర్చకు దారి తీసే అవకాశం ఉంది. మరో మూడు రోజుల పాటు బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలోనే మకాం వేయనుండడంతో రాబోయే రోజుల్లో గులాబీ పార్టీ అనుసరించే వ్యూహాలు కమలనాథులకు మరిన్ని చిక్కులు తెచ్చే పెట్టె ఛాన్స్ కనిపిస్తోంది.

Also Read : Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే