జగన్‌కు మద్దతు, కేసీఆర్‌‌కు వ్యతిరేకం.. తెలుగు రాష్ట్రాల మధ్య బీజేపీ చిచ్చు

  • Published By: naveen ,Published On : October 19, 2020 / 11:30 AM IST
జగన్‌కు మద్దతు, కేసీఆర్‌‌కు వ్యతిరేకం.. తెలుగు రాష్ట్రాల మధ్య బీజేపీ చిచ్చు

bjp double game: అపెక్స్ కౌన్సిల్‌పై జాతీయ పార్టీ అయిన బీజేపీ వేర్వేరు సిద్ధాంతాల‌తో వ్యవ‌హ‌రిస్తోందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ జ‌గ‌న్ ప్రభుత్వానికి వెన్నుద‌న్నుగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రయోజ‌నాలు కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజ‌ల ప‌క్షాన అపెక్స్ కౌన్సిల్‌లో బలంగా వాదనలు వినిపించాలంటూ జ‌గ‌న్‌కు సూచించడంతో పాటు రాయలసీమకు న్యాయం చేయాలంటూ కేంద్రమంత్రికి లేఖ రాసింది. పోతిరెడ్డిపాడు విష‌యంలో వెన‌క్కు త‌గ్గకుండా రాష్ట్రానికి రావల్సిన నీటి వాటాను పొందేందుకు కృషి చేయాలని సలహా ఇచ్చింది. అపెక్స్ కౌన్సిల్ లో వినిపించే వాద‌నల ద్వారా భ‌విష్యత్‌లో రాష్ట్రానికి నీటి వాటా విష‌యంలో న‌ష్టం జ‌ర‌గ‌కుండా చూసుకోవ‌చ్చంటూ లేఖ‌లో తెలిపింది.

సీఎం కేసీఆర్ పై బీజేపీ విమర్శలు:
తెలంగాణ విష‌యంలో అది జ‌ర‌గ‌లేదు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ‌కు న‌ష్టం జ‌రిగేలా వ్యవ‌హ‌రిస్తోందంటూ ఆందోళ‌న చేప‌ట్టారు ఇక్కడి బీజేపీ నేతలు. జల వివాదం అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలవాల్సింది పోయి అపెక్స్ కౌన్సిల్ స‌మావేశంలో తెలంగాణ హ‌క్కుల‌ను తాక‌ట్టు పెట్టేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవ‌హ‌రిస్తున్నార‌ని విమర్శిస్తున్నారు. నీటి వాటాను త‌గ్గించుకునేలా ముఖ్యమంత్రి వ్యవ‌హ‌రించ‌డం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ తెలంగాణ భ‌వ‌న్‌తో పాటు ఐదు జిల్లాల్లోనూ ఆందోళ‌న కార్యక్రమాలు చేప‌ట్టింది.

బీజేపీ రెండు నాల్కల ధోరణిని ప్రశ్నిస్తున్న టీఆర్ఎస్‌:
అపెక్స్ కౌన్సిల్ స‌మావేశానికి ముందే ఆందోళ‌నలు చేపట్టారు. రాష్ట్ర ప్రయోజ‌నాలు కాపాడకుండా కాంట్రాక్టర్‌కు మేలు జ‌రిగేలా టీఆర్ఎస్ వ్యవ‌హ‌రిస్తోంద‌ని, కృష్ణా జ‌లాలు దోపిడీకి ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవ‌హ‌రిస్తున్నారంటూ రోడ్డెక్కుతోంది తెలంగాణ బీజేపీ.

అపెక్స్ కౌన్సిల్ సమావేశం కొనసాగుతున్న సమయంలోనే కృష్ణా బేసిన్‌ జిల్లాలు అయిన ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఆందోళనలకు పిలుపిచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని రాష్ట్రాల‌కు న్యాయం చేయాల్సింది పోయి ఓ రాష్ట్రం న‌ష్టపోతుంటే ల‌బ్ధి పొందే రాష్ట్రాల‌కు మ‌ద్దతుగా లేఖ‌లు రాయ‌డం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు టీఆర్‌ఎస్‌ నేత‌లు.