లక్ష్యం 2023.. కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసిన డీకే అరుణ

  • Published By: naveen ,Published On : November 9, 2020 / 05:29 PM IST
లక్ష్యం 2023.. కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసిన డీకే అరుణ

bjp mahaboob nagar: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు తెలంగాణ రాష్ట్రంలోనే ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్ర రాజకీయాలంతా పాలమూరు జిల్లా రాజకీయాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. 2014కు ముందు ఆ జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు నేతలు టికెట్ల కోసం పోటీ పడేవారు. అలాంటి జిల్లాలో 2014 తర్వాత సీన్ రివర్స్ అయింది. రోజురోజుకు ఆ పార్టీ బలహీన పడడంతో కేడర్ అంతా ఇతర పార్టీల్లోకి జంప్ అయింది. కీలక నేతలు కూడా రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీలకు వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలహీన పడింది. నిన్నమొన్నటి వరకు పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న కొంతమంది కీలక నేతలు.. పార్టీ మారడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓ కొత్త సమస్య వచ్చి పడిందని అంటున్నారు.

బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి:
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రిగా పని చేసి, జిల్లా రాజకీయాలనే శాసించిన డీకే అరుణ పార్లమెంటు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వీడి బీజేపీలో చేరారు. పార్లమెంటు ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చిన అరుణ.. బీజేపీ ఓట్ బ్యాంకుతో పాటు కాంగ్రెస్ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. అయితే మంత్రిగా ఉన్నప్పుడు రాజకీయాలను తమ గుప్పిట్లో పెట్టుకొని శాసించిన అరుణ… ప్రస్తుతం ఓ వ్యూహాన్ని రచిస్తున్నారట. జిల్లాలో బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెబుతున్నారు.

కాంగ్రెస్ కి చెందిన బలమైన నేతలకు గాలం:
బీజేపీకి సరైన నియోజకవర్గ ఇన్‌చార్జులు లేని చోట్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇన్‌చార్జులపై అరుణ దృష్టి పెట్టారని అంటున్నారు. నారాయణపేట, మక్తల్, అలంపూర్, షాద్‌నగర్, కొల్లాపూర్, దేవరకద్ర, జడ్చర్ల, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాలపై స్పెషల్‌గా దృష్టి పెట్టి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించబోతున్నారట. వారికి కీలక బాధ్యతలు అప్పజెప్పాలనే వ్యూహాలను సిద్ధం చేశారని టాక్‌.

బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా:
ఇప్పటికే బీజేపీలోకి డీకే అరుణ చేరిన తర్వాత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంఎల్ఏ ఎర్ర శేఖర్, దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి డోకూరు పవన్ కుమార్ కూడా బీజేపీ కండువా కప్పుకొన్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా సిద్ధం కావాలని బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారని అంటున్నారు.

ఆయనను బీజేపీలోకి తీసుకుంటే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని భావన:
నారాయణపేట నియోజకవర్గం మొదటి నుంచి బీజేపీకి మంచి పట్టున్న ప్రాంతం. సరైన నాయకత్వం లేకపోవడంతో ఆ పార్టీకి కలసిరావడం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన శివకుమార్‌పై, మక్తల్ నియోజకవర్గానికి చెందిన జలంధర్ రెడ్డిపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందని అంటున్నారు. గత ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించి రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జలంధర్ రెడ్డి గట్టి పోటీనివ్వడంతో ఆయనను బీజేపీలోకి తీసుకుంటే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు.

సంపత్ పై అరుణ ఫోకస్:
మరోవైపు అలంపూర్ నియోజకవర్గం గతంలో కాషాయ పార్టీకి మంచి పట్టున్న ప్రాంతం. రవీంద్రనాథ్‌రెడ్డి ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. అక్కడ డీకే అరుణకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సంపత్‌పై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశాలు లేకపోవడంతో తన పాత కేడర్‌ను బీజేపీ వైపు తీసుకెళ్లేందుకు అరుణ ప్రయత్నాలు మొదలుపెట్టారని అంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న పాలమూరు జిల్లాపై ఇప్పుడు కాషాయ పార్టీ పట్టు సాధించేలా కనిపిస్తోంది.

మనకెందుకులే అన్నరీతిలో కాంగ్రెస్ నేతలు:
కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేపట్టినా పార్టీని అంటి పెట్టుకొని ఉన్న నేతలు కూడా తమకెందులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. ఎన్నికల నాటికి టికెట్ ఎవరికొస్తుందో.. ఎవరికి రాదో తెలియని పరిస్థితులున్నందున లైట్‌ తీసుకుంటున్నారని కాంగ్రెస్‌ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో కేఎల్ఐ ప్రాజెక్టులో నీట మునిగిన మోటార్లపై పెద్దఎత్తున ఆందోళన చేసి జిల్లా బందుకు పిలుపునిచ్చింది. కాకపోతే ఆ బంద్ ప్రభావం ఎక్కడా కనిపించ లేదు.

కాంగ్రెస్ తన కేడర్ ను కాపాడుకుంటుందా?
కింది స్థాయి పార్టీ కేడర్‌ తమ నేతలకు ఫోన్లు చేసి బంద్‌ను సక్సెస్ చేయాలని కోరే ప్రయత్నం చేశారట. అయితే ఆయా నేతల ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడం, తాము బిజీగా ఉన్నామంటూ సమాధానాలివ్వడంతో కేడర్‌ నిరుత్సాహ పడిందంటున్నారు. ఉన్న కొద్దిపాటి కేడర్ కూడా ఇలాంటి పరిణామాలపై ఆందోళనలో ఉందని చెబుతున్నారు. ఓవైపు జిల్లాలో బలంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని కమలనాథులు ప్రచారం మొదలు పెట్టారు. మరి కాంగ్రెస్‌ పార్టీ తమ కేడర్‌ను కాపాడుకునేందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో చూడాలి.