GVL Challenge KTR : తెలంగాణ ప్రజలను ఏపీకి కాకుండా యూపీకి పంపే దమ్ముందా? కేటీఆర్‌కు జీవీఎల్ సవాల్

బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు మరో విధంగా స్పందించారు. ఆయన ఉత్తరప్రదేశ్ ప్రస్తావన తెరపైకి తెచ్చారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను పొరుగు రాష్ట్రం ఏపీకి కాకుండా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పంపాల‌ని కేటీఆర్‌కు సూచించారు.

GVL Challenge KTR : తెలంగాణ ప్రజలను ఏపీకి కాకుండా యూపీకి పంపే దమ్ముందా? కేటీఆర్‌కు జీవీఎల్ సవాల్

Gvl Challenge Ktr

GVL Challenge KTR : ఏపీలో మౌలిక వసతుల కల్పన గురించి, అభివృద్ధి గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎలాంటి అభివృద్ది జ‌రుగుతుందో తెలియాలంటే తెలంగాణ ప్ర‌జ‌ల‌ను పొరుగు రాష్ట్రానికి పంపాల‌ని త‌న మిత్రుడు చెప్పాడంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు చిచ్చు రాజేశాయి. కేటీఆర్ కామెంట్స్ పై ఏపీ మంత్రులు, మాజీ మంత్రులు, వైసీపీ నేతలు వ‌రుస‌బెట్టి తీవ్రంగా స్పందిస్తున్నారు. కేటీఆర్ కు కౌంటర్లు ఇస్తున్నారు. టైమ్, డేట్ చెప్పు కేటీఆర్.. ఏపీ మొత్తం తిప్పి చూపిస్తా అని మంత్రి రోజా అంటే.. నాలుగు కాదు 400 బస్సుల్లో ఏపీకి వచ్చి చూడండి అని మరో మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు.

ఇది ఇలా ఉంటే ఈ వ్యవహారంలోకి బీజేపీ సైతం తలదూర్చింది. బీజేపీకి చెందిన కీల‌క నేత‌, ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు మరో విధంగా స్పందించారు. ఆయన ఉత్తరప్రదేశ్ ప్రస్తావన తెరపైకి తెచ్చారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను పొరుగు రాష్ట్రం ఏపీకి కాకుండా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పంపాల‌ని కేటీఆర్‌కు సూచించారు జీవీఎల్.(GVL Challenge KTR)

KTR Comments : డేట్, టైమ్ చెప్పు కేటీఆర్!.. ఏపీ మొత్తం తిప్పి చూపిస్తా

ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా జీవీఎల్ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలను అధ్వాన్నంగా పరిపాలిస్తున్న టీఆర్ఎస్ పాల‌కులు త‌మ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఏపీకి కాకుండా ఉత్తరప్రదేశ్ కు పంపాల‌ని జీవీఎల్ సూచించారు. అవినీతిని, అరాచకాలను డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఎలా బుల్డోజింగ్ చేస్తుందో తెలంగాణ‌ ప్రజలు చూస్తారని జీవీఎల్ అన్నారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ కోసం తెలంగాణ ఎదురుచూస్తోంద‌న్న జీవీఎల్‌.. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పంపే ధైర్యం ఉందా? అంటూ కేటీఆర్‌కు స‌వాల్ విసిరారు జీవీఎల్ నరసింహారావు.

కేటీఆర్ ఏమన్నారంటే..
ఏపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో కరెంట్ సరిగ్గా లేదని, నీళ్లు కూడా లేవని, అభివృద్ధి జరగడం లేదని, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని తన మిత్రులు చెప్పారంటూ వ్యాఖ్యానించారు.(GVL Challenge KTR)

Peddireddy Counter To KTR : ఓట్ల కోస‌మే ఏపీపై విమర్శలు-కేటీఆర్‌కు మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్

”ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ లేదు. నీళ్లు లేవు. రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయి. ఏపీలోని సొంతూళ్లకు వెళ్లొచ్చిన నా మిత్రులు ఈ విషయాన్ని నాతో చెప్పారు. ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టు ఉందంటున్నారు. బెంగళూరులోని కంపెనీలు కూడా ఏపీలోని అధ్వాన్నపు రోడ్ల గురించి మాట్లాడుతున్నాయి. అదే తెలంగాణ విషయానికి వస్తే.. చాలా ప్రశాంతమైన రాష్ట్రం. దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ. తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉందో ఏపీ ప్రజలకు అర్థమైంది. నగరాల్లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయకపోతే వెనుకపడిపోతాం. ఏపీతో పోలిస్తే తెలంగాణలో మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయి” అని కేటీఆర్ అన్నారు. ఏపీని ఉద్దేశించి కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపాయి.