MLA Etela Rajender : దుబ్బాక, హుజూరాబాద్‌లో మీటర్లు పెట్టారా? సీఎం కేసీఆర్‌పై ఈటల నిప్పులు

విద్యుత్ మీటర్ల గురించి ఇంకా ఎన్ని రోజులు చెబుతారని ఈటల ప్రశ్నించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అక్కడ మీటర్లు పెట్టారా అని ప్రశ్నించారు.

MLA Etela Rajender : దుబ్బాక, హుజూరాబాద్‌లో మీటర్లు పెట్టారా? సీఎం కేసీఆర్‌పై ఈటల నిప్పులు

MLA Etela Rajender : తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లుపై అకారణంగా నిందిస్తున్నారని ఫైర్ అయ్యారు. సింగరేణి, విద్యుత్ సంస్థలను కేసీఆర్ ముంచుతున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. సీఎం హోదాలో ఉండి కూడా ప్రధాని గురించి జుగుప్సాకరంగా మాట్లాడారని ధ్వజమెత్తారు. విద్యుత్ మీటర్ల గురించి ఇంకా ఎన్ని రోజులు చెబుతారని ఈటల ప్రశ్నించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అక్కడ మీటర్లు పెట్టారా అని ప్రశ్నించారు. త్వరలోనే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఫీజు పీకేస్తారని హెచ్చరించారు ఈటల రాజేందర్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభ బహిరంగ సభలో ఈటల రాజేందర్ ఈ కామెంట్స్ చేశారు.

”సింగరేణి దివాళా తీసింది. సింగరేణి కంపెనీలకు దాదాపుగా 10వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. ఆ లెక్కలు కూడా బయటపడకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. జెన్ కోకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు 7వేల కోట్ల రూపాయలు బాకీ ఉందని కేంద్రం ఆధీనంలో ఉన్న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చెప్పింది. ఇక్కడి బాధ చూడలేక వాళ్లు పది వేల కోట్ల రూపాయల లోన్లు ఇచ్చారు.

అలాంటి కేంద్ర ప్రభుత్వాన్ని నేడు కేసీఆర్ తిట్టే పరిస్థితి ఉందంటే ఆయనకు ఎంత విశ్వాసం ఉందో, నిజాయితీ ఉందో అర్థం చేసుకోవాలి. హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో ఏం చేశారో ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికలోనూ అదే చేయబోతున్నారు. ఆరు నూరైనా మునుగోడు ప్రజానీకం కూడా తప్పకుండా బీజేపీని ఆశీర్వదిస్తారు. హుజూరాబాద్ లో ఏ తీర్పు అయితే వచ్చిందో మునుగోడులో కూడా గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. గెలిచే అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి. మునుగోడులో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా.. ఎన్ని రకాల అధికార దుర్వినియోగానికి పాల్పడినా.. అక్కడా బీజేపీదే గెలుపు అని” అని ఈటల రాజేందర్ అన్నారు.