Bonalu : రెండేళ్ల తరువాత జరిగే బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఆషాడం బోనాల సందడి మొదలైంది. నెల రోజులపాటు అంగరంగ వైభవంగా సాగనున్న ఉత్సవాలకు భాగ్యనగరంలోని ఆలయాలు అందంగా ముస్తాబవుతున్నాయి. కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత జరిగే ఈ ఉత్సవాలకు ప్రభుత్వం భారీయెత్తున ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం 15 కోట్ల రూపాయలు కేటాయించింది.

Bonalu : రెండేళ్ల తరువాత జరిగే బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు

Bonalu In Telangana

Bonalu in Telangana :  తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఆషాడం బోనాల సందడి మొదలైంది. నెల రోజులపాటు అంగరంగ వైభవంగా సాగనున్న ఉత్సవాలకు భాగ్యనగరంలోని ఆలయాలు అందంగా ముస్తాబవుతున్నాయి. కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత జరిగే ఈ ఉత్సవాలకు ప్రభుత్వం భారీయెత్తున ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం 15 కోట్ల రూపాయలు కేటాయించింది.

తెలంగాణ బోనాల జాతరకు మళ్లీ పూర్వ కళ వచ్చేసింది. కరోనా కాలంలో చడీచప్పుడూలేని ఉత్సవాలు…ఈసారి కనీవినీ ఎరుగనంత వైభవంగా జరగబోతున్నాయి. ఆలయాలన్నీ కళకళలాడబోతున్నాయి. సంప్రదాయబద్దంగా గతంలోలాగే ఈసారి కూడా ఆషాడ బోనాల సంబరాలు… గోల్కొండ కోటలోని జగదాంబ అమ్మవారి బోనాలతో ఈ నెల 30నుంచి ప్రారంభం అవుతాయి. అయితే మంగళవారమే బోనాలకు అంకురార్పణ జరగనుంది. ఆ తర్వాత జూలై 17న సికింద్రాబాద్‌, ఆ తర్వాత జూలై 24న హైదరాబాద్ పాతబస్తీలో ని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలతో ముగుస్తాయి.

ఈసారి బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ప్రభుత్వ దేవాలయాలకే కాకుండా దాదాపు 3 వేల ప్రైవేటు దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయం అందిస్తోంది. నగరంలోని సుమారు 26 దేవాలయాలలో ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అదేవిధంగా అమ్మవారి ఊరేగింపు కోసం అయ్యే అంబారీల ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించనుంది. ఆలయాల పరిసరాల్లో రోడ్ల మరమ్మతులు, విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ, మంచి నీటి సౌకర్యంలాంటి ఏర్పాట్లు చేస్తోంది. ఆలయాల పరిసరాల్లో భక్తుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో LED స్క్రీన్‌లు, త్రీడీ మ్యాపింగ్‌లు, పలు ఆలయాల వద్ద ప్రత్యేకంగా స్టేజీలు ఏర్పాటు చేసి సాంస్కృతిక శాఖ కార్యక్రమాలు నిర్వహించనుంది.

బోనాలతో పాటు బక్రీద్ పండుగ వస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య రాకుండా ఉండేందుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గోల్కొండలోని జగదాంబ మహంకాళి ఆలయ ప్రాంతంలో CC కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. భారీయెత్తున మఫ్టీ పోలీసులను, షీ టీమ్‌లను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే వాహనాల పార్కింగ్‌ కోసం 8 ప్రాంతాలను గుర్తించారు. భక్తుల దాహార్తి తీర్చేందుకు వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో 8.75 లక్షల వాటర్ ప్యాకెట్స్, 55 వేల వాటర్ బాటిల్స్‌ను అందుబాటులో వుంచుతున్నారు. అంతేగాకుండా నాలుగు ఆంబులెన్స్‌ వాహనాలను, 5 మెడికల్‌ క్యాంప్‌లను ఏర్పాటు చేస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా RTC బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.