స్కూల్ కెళ్లి చదువుకోమన్నారని బాలుడు ఆత్మహత్య

స్కూల్ కెళ్లి చదువుకోమన్నారని బాలుడు ఆత్మహత్య

boy commits suicide in vikarabad: తరగతి గదిలో అతను అందరికంటే ఎత్తు. వయసూ(17ఏళ్లు) ఎక్కువే. కాగా, పలు కారణాలతో 8వ తరగతిలో చేరాడు. ఇతడిని చూసి తోటి పిల్లలు ఆట పట్టించసాగారు. వయసులో మా కంటే పెద్దవాడివంటూ తరచూ హేళన చేయసాగారు.  దీంతో ఆ అబ్బాయి ఫీల్ అయ్యాడు. తాను స్కూల్ కి వెళ్లనని, ప్రైవేటుగా పదో తరగతి చదువుతానని తల్లి, కుటుంబ సభ్యులతో మొర పెట్టుకున్నాడు. వారు కాదన్నారు. దీంతో మనో వేదనకు గురైన బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

వికారాబాద్‌ జిల్లా కొత్తగడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తోటి పిల్లలు ఆటపట్టించడం , హేళన చేయడం అతడిని వేదనకు గురి చేసింది. ఇంట్లో వాళ్లు తన మాట వినకపోవడం మరింత బాధించింది. దీంతో ఆ బాలుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని కొత్తగడి గ్రామానికి చెందిన సన్‌వెల్లి శంకరయ్య, చంద్రకళ దంపతులకు ఇద్దరు కుమారులు. అరుణ్, మహేందర్‌(17) ఉన్నారు. నెల రోజుల క్రితం శంకరయ్య అనారోగ్యంతో మృతిచెందాడు. తల్లి చంద్రకళ కూలిపనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది.

మహేందర్ స్థానిక ప్రభుత్వ స్కూల్ లో 8వ తరగతిలో చేరాడు. అయితే అతడు బాగా ఎత్తుగా ఉంటాడు. పైగా వయసులో పెద్దవాడు. క్లాస్ రూమ్ లో అందరూ అతడి కంటే చిన్నవారు. దీంతో మిగతా పిల్లలు అతడిని ఆటపట్టించారు, హేళన చేశారు. అంతేకాదు అందరికంటే పెద్దగా ఉన్నందున గొడవ చేశారు. దీంతో బాలుడు మనస్తాపం చెందాడు. ఇంటికెళ్లి విషయం చెప్పాడు. నేను స్కూల్ కి వెళ్లను, డిస్టెన్స్ లో టెన్త్ క్లాస్ చదువుతానని కోరాడు.

అయితే, కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకోలేదు. అదరితోపాటు చదివితేనే బాగుంటుందని బాలుడికి తేల్చి చెప్పారు. దీంతో ఆ బాలుడు మరింత వేదనకు గురయ్యాడు. తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. సోమవారం(మార్చి 1,2021) సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకున్నాడు.

బయటికి వెళ్లిన తల్లి, అన్న ఇంటికి వచ్చే సరికి తలుపులు వేసి ఉండటంతో కంగారు పడ్డారు. తలుపులు తెరిచే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. గ్రామస్తుల సాయంతో తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లారు. బాలుడు చీరతో ఉరివేసుకొని కనిపించాడు. దీంతో వారు షాక్ తిన్నారు. వెంటనే బాలుడిని కిందకి దించి వికారాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే బాలుడు మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు.

బాలుడి మృతితో ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. కాగా, నెల క్రితమే బాలుడి తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ విషాదం నుంచి తేరుకోక ముందే ఇలా కావడంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదించారు.