Sagar Covid Hotspot : నిండాముంచిన సాగర్‌ ఉప ఎన్నిక.. ప్రచారం తర్వాత భారీగా పెరిగిన కరోనా కేసులు

ఉప ఎన్నికలు నాగార్జున సాగర్‌ను కోవిడ్‌ హాట్‌స్పాట్‌గా మార్చేశాయి. బైపోల్‌ తర్వాత అక్కడ సీన్‌ అంతా మారిపోయింది.

Sagar Covid Hotspot : నిండాముంచిన సాగర్‌ ఉప ఎన్నిక.. ప్రచారం తర్వాత భారీగా పెరిగిన కరోనా కేసులు

క‌రోనా హాట్‏స్పాట్‏గా సాగ‌ర్

Nagarjuna Sagar Covid hotspot : ఉప ఎన్నికలు నాగార్జున సాగర్‌ను కోవిడ్‌ హాట్‌స్పాట్‌గా మార్చేశాయి. బైపోల్‌ తర్వాత అక్కడ సీన్‌ అంతా మారిపోయింది. ఎన్నికల ముందు.. ఎన్నికల తర్వాత అన్నట్లుగా మారాయి అక్కడి పరిస్థితులు. మొన్నటివరకూ ఎన్నికల గురించి టెన్షన్‌ పడ్డ నేతలంతా.. ఇప్పుడు కరోనా గురించి బెంబేలెత్తుతున్నారు. పోలింగ్ ముగిసినప్పటి నుంచి వరుసగా నియోజకవర్గంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రాజకీయ నాయకులు, అధికారులు, ఉద్యోగులు కరోనా బారినపడుతున్నారు.

బైపోల్‌ను అన్ని పార్టీలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఎక్కడా లేని నాయకులంతా సాగర్‌లో వచ్చిపడిపోయారు. దీంతో లోకల్​లీడర్లతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చి ప్రచారంలో పాల్గొన్న నేతల్లో చాలా మందికి కరోనా సోకింది. వాళ్ల ద్వారా జనాలకూ వైరస్ వ్యాపించింది. మార్చి 1 ముందు నల్గొండ జిల్లాలో పెద్దగా కేసులు లేకున్నా.. క్యాంపెయిన్​స్టార్ట్​ అయ్యాక భారీగా కేసులు పెరిగాయి. మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 20 వరకు నల్గొండ జిల్లాలో కేవలం 5 వేల పాజిటివ్ ​కేసులు వచ్చాయి.

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చాలామంది నేతలు.. పోలింగ్ సిబ్బంది.. మీడియా ప్రతినిధులకూ కోవిడ్ -19 వైరస్ సోకింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్, ఆయన కుటుంబ సభ్యులకు పాజిటివ్ రావడంతో ప్రస్తుతం వారంతా హైదరాబాద్‌‌‌‌లో హోం ఐసోలేషన్‌‌‌‌లో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం కేసీఆర్‌కు కూడా.. సాగర్‌ ఉప ఎన్నికల ప్రచారంలోనే కోవిడ్‌ సోకినట్లు తెలుస్తోంది. వీళ్లతో పాటు పార్టీ లీడర్లు కోటిరెడ్డి, కడారి అంజయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్​రెడ్డి, ఆయన భార్య నివేదితారెడ్డి, కాంగ్రెస్ లీడర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కరోనా బారిన పడ్డారు. టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ వ్యక్తిగత సిబ్బందిలో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది.

ప్రస్తుతం నాగార్జున సాగర్‌ నియోజకవర్గ పరిధి‌‌‌‌‌‌‌లో వేలాది మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. ఎలక్షన్ల టైమ్‌‌‌‌లో కరోనా తీవ్రత గురించి పలువురు హెచ్చరించినా అధికారులు, నాయకులు ఎవరూ పట్టించుకోలేదు. కేసీఆర్ సభ జరిగిన మరుసటి రోజే నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు‌‌‌ కూడా కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆయన ఇంటి నుంచే ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిడమనూరు తహసీల్దార్​ఆఫీసులో పనిచేస్తున్న ఆర్ఐకీ పాజిటివ్ వచ్చింది. ఎన్నికల ఆర్వో ఆఫీసు ఇక్కడే ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్​గుర్రంపోడు ఇన్‌‌‌‌చార్జిగా వ్యవహరించిన ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి డ్రైవర్లకు, ఆయన వెంట వచ్చిన పలువురు లీడర్లకు పాజిటివ్ వచ్చింది.

ఈ నెల 21న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనాతో 8 మంది మృతిచెందగా.. అందులో ఇద్దరు నాగార్జునసాగర్ వాసులున్నారు. వీరిలో ఒకరు టూరీజం శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయవిహార్ హోటల్ సిబ్బంది. ఉపఎన్నికల ప్రచార సమయంలో వివిధ పార్టీల కీలక నేతలంతా ఆ హోటల్‌లో బస చేయడంతో ఇప్పుడు అందరూ టెన్షన్ పడుతున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 50 వేల ఆరు వందల నాలుగుకు చేరింది. యాక్టివ్ కేసులు ఎనిమిది వేల ఎనిమిది వందల 84 ఉన్నాయి. అధికారిక సమాచారం ప్రకారం 216 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. అయితే ఉమ్మడి జిల్లాలో వాస్తవ కేసులు, మరణాల సంఖ్య ఇంతకు రెండురెట్లు ఎక్కువే ఉంటాయన్న అభిప్రాయం బలంగా ఉంది.