ఊళ్లలో ప్రభుత్వ క్లినిక్ లు

ఊళ్లలో ప్రభుత్వ క్లినిక్ లు

central govt decided government clinics : పల్లెలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ క్లినిక్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆరోగ్య మిషన్ సమీక్షా సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి పలువురు సీనియర్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆరోగ్య ఉప కేంద్రాలనే దశల వారీగా క్లినిక్‌లుగా మారుస్తారు. ఎంబీబీఎస్‌ లేదా ఆయుర్వేద లేదా హోమియో లేదా ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను నియమించాలని నిర్ణయించినట్లు ఆ సమావేశంలో పాల్గొన్న అధికారులు వెల్లడించారు. దీనిపై కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు ఒక ఉన్నతాధికారి వెల్లడించారు.

పల్లెల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ) వైద్యానికి కీలకంగా ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్, నర్సులు ఉండడంతో ప్రాథమిక వైద్యం ఇక్కడే అందనుంది. ఒక్కో మండలంలో ఒక్కోటి చొప్పున మాత్రమే ఉన్నాయి. మండలంలో 15 నుంచి 20 గ్రామాలుంటే…వీరంతా..పీహెచ్ సీలకు వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని కిలోమీటర్లు వెళ్తేగాని..గ్రామాలకు వైద్యం అందే పరిస్థితి లేదు. రాష్ట్రంలో పీహెచ్‌సీల కింద 4,905 ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. వీటిలో ఏఎన్‌ఎంలే ప్రస్తుతం బాస్‌లుగా ఉన్నారు. ఆయా ఉపకేంద్రాల్లో టీకాలు ఇవ్వడం, గర్భిణులు, పిల్లలకు మందులివ్వడం వంటివి మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ ఆరోగ్య ఉప కేంద్రాలను క్లినిక్‌లుగా లేదా వెల్‌నెస్‌ సెంటర్లుగా మార్పు చేసి వాటిల్లో వైద్య సేవలు ప్రారంభిస్తారు. తద్వారా ప్రతీ రెండు మూడు గ్రామాలకు ఒక క్లినిక్‌ లేదా ఒక పెద్ద గ్రామంలో ఒక క్లినిక్‌ ఉండేలా ప్రణాళిక రూపొందిస్తారు. ఆయా క్లినిక్‌లలో రక్త పరీక్ష చేయడం, బీపీ, షుగర్‌ పరీక్షలు నిర్వహించడం, వాటికి తగు వైద్యం అందించడంపై ఫోకస్‌ పెడతారు. దీంతో ప్రైవేట్‌ ప్రాక్టీషనర్లపై ఆధారపడకుండా నాణ్యమైన వైద్యం రోగులకు అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రతి సంవత్సరం వేలాది మంది వైద్యులు ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. వీరి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తోంది. ఆయుష్ వైద్యుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ప్రజలకు మరింత చేరువకు వైద్య సేవలు తీసుకురావాలన్నా ఆరోగ్య ఉప కేంద్రాలను క్లినిక్‌లుగా మార్చడం సరైందని కేంద్రం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. డాక్టర్లను లేదా ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించే అవకాశం ఉంది. పారితోషికాన్ని ఎన్‌హెచ్‌ఎం ద్వారా ఇస్తారు. మూడేళ్ల పాటు ఆయా క్లినిక్‌లలో పనిచేయాలన్న హామీపత్రం ఇవ్వాలన్న నియమం పెట్టే అవకాశం ఉంది.