ఏటా రూ.10వేలు.. న్యూ కాన్సెప్ట్ : తెలంగాణ రైతుబంధు పథకానికి కేంద్రం ప్రశంసలు

రైతులకు పెట్టుబడి సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రైతుబంధు. ఈ పథకాన్ని కేంద్రం ప్రశంసించింది. రైతుబంధు ఓ వినూత్న ఆలోచన అని

  • Published By: veegamteam ,Published On : February 1, 2020 / 10:44 AM IST
ఏటా రూ.10వేలు.. న్యూ కాన్సెప్ట్ : తెలంగాణ రైతుబంధు పథకానికి కేంద్రం ప్రశంసలు

రైతులకు పెట్టుబడి సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రైతుబంధు. ఈ పథకాన్ని కేంద్రం ప్రశంసించింది. రైతుబంధు ఓ వినూత్న ఆలోచన అని

రైతులకు పెట్టుబడి సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రైతుబంధు. ఈ పథకాన్ని కేంద్రం ప్రశంసించింది. రైతుబంధు ఓ వినూత్న ఆలోచన అని కితాబిచ్చింది. దేశం మొత్తంలో కేవలం తెలంగాణలో మాత్రమే విజయవంతంగా అమలవుతున్న రైతుబంధును ఇప్పటికే పలు రంగాల ప్రముఖులు అభినందించారు. తాజాగా కేంద్ర ఆర్థిక సర్వే 2019-20 నివేదికలోనూ తెలంగాణ రైతుబంధును ప్రత్యేకంగా కొనియాడారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఆర్థికసర్వే 2019-20 నివేదికను విడుదల చేశారు. నివేదికలో భాగంగా వ్యవసాయం- ఆహార పదార్థాల నిర్వహణ అనే విభాగంలో దేశ వ్యవసాయరంగ పరిస్థితి, పురోగతిని వివరించారు. ఇందులో తెలంగాణ రైతుబంధు పథకాన్ని వివరాలతో సహా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ఈ పథకాన్ని రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ఓ వినూత్న ఆలోచన (న్యూ కాన్సెప్ట్)గా నివేదికలో పేర్కొనడం విశేషం.

రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న మరో రెండు రాష్ట్రాలు ఒడిశా, జార్ఖండ్‌ తోపాటు కేంద్రం ఎకరాకు ఏటా రూ.6 వేల చొప్పున అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని కూడా ఈ నివేదికలో ప్రస్తావించగా.. ఇవీ రైతు బంధును ఆదర్శంగా తీసుకొని అమల్లోకి వచ్చినవే కావడం మరో విశేషం. వీటిని బేరీజు వేస్తే ఇతర రెండు రాష్ట్రాలతో పాటు కేంద్రం ఇచ్చే పెట్టుబడి సాయం కంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే మొత్తమే ఎక్కువగా ఉంది. 

కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి కింద విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఏటా మూడు దఫాలుగా రూ.2 వేల చొప్పున సాయం చేస్తోంది. ఒడిశా ప్రభుత్వం భూమి ఉన్న రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు గరిష్ఠంగా రూ.25 వేలు ఇస్తుంది. జార్ఖండ్ ప్రభుత్వం గరిష్ఠంగా 5 ఎకరాలను ప్రామాణికంగా తీసుకొని ఎకరాకు రూ.5 వేల చొప్పున అంటే గరిష్ఠంగా రూ.25 వేలు సాయం చేస్తుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏటా రెండు సీజన్లకు ఎకరాకు రూ.5 వేల చొప్పున అంటే ఎకరాకు రూ. 10 వేలను ఎన్ని ఎకరాలు ఉన్నా అమలు చేస్తోంది.

2018- 19లో రూ.12 వేల కోట్లు కేటాయింపు:
తెలంగాణ రైతుబంధు పథకాన్ని సర్వే నివేదికలో పూర్తి వివరాలతో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. పంట సీజన్ కంటే ముందుగానే పెట్టుబడి సాయాన్ని రైతులకు అందిస్తారు. 2018లో వానకాలం నుంచి దీన్ని అమలు చేస్తున్నారు. తొలుత ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు సీజన్లలో ఎకరాకు రూ.8 వేల చొప్పున పంపిణీ చేశారు. 2018- 19లో ఈ పథకానికి రూ.12 వేల కోట్లు కేటాయించారు. 2018-19 వానకాలం సీజన్‌లో 51.50 లక్షల రైతులకు రూ.5,260.94 కోట్లను పెట్టుబడిగా చెక్కుల రూపంలో అందజేశారు. 2018-19 యాసంగి సీజన్ నుంచి ఈ- కుబేర్ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలో జమచేయడం ప్రారంభించారు. తద్వారా  యాసంగిలో 49.03 లక్షల రైతులకు రూ.5,244.26 కోట్లను ఖాతాల్లో జమ చేశారు. 2019-20 నుంచి పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేల చొప్పున రెండు సీజన్లకు ఏటా ఎకరాకు రూ.10 వేలు అందిస్తున్నదిఅని వివరించారు.

ఐదేళ్లలో సరాసరిలో తెలంగాణ టాప్:
దేశవ్యాప్తంగా సేవారంగ సరాసరి వృద్ధిలో తెలంగాణ టాప్‌లో నిలిచింది. దేశంలో సేవారంగం (వాణిజ్యం, హోటళ్లు, రవాణా, సమాచార తదితరాలతో కూడిన) పురోగతిని గణాంకాలతో సహా సర్వేను నివేదికలో వివరించారు. ఇందులో జీఎస్వీఏ (గ్రాస్ స్టేట్ వ్యాల్యూ ఆడెడ్)లో సేవారంగం వాటా వివరాలను పేర్కొన్నారు. 2018-19లో ఎంత వాటా ఉందో? గత ఐదేళ్లలో సరాసరి వృద్ధిని వివరించారు. దేశంలోఐదేళ్లలో తెలంగాణ 11.2 శాతంతో నంబర్‌ వన్‌గా నిలిచింది. తర్వాత 10.5%తో కర్ణాటక రెండో స్థానంలో నిలువగా.. మిగిలినవన్నీ పది శాతంలోపే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ది 9.8 శాతం. పర్యాటక ఉపాధిలోనూ తెలంగాణ మెరుగైన స్థానంలోనే ఉంది. 2015-16 గణాంకాలను నివేదికలో పొందుపరిచారు. భౌగోళిక అనుకూలతలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు దాద్రానగర్ హవేలీ, గోవా, డయ్యూ-డామన్, లక్షద్వీప్, అండమాన్- నికోబార్ దీవులు ఉండగా.. ఆ తర్వాత కేరళ తొలి పది స్థానాల్లో ఉండగా.. తెలంగాణ 17.83 శాతంతో 11వ స్థానంలో ఉంది.

మత్స్య సంపద ఉత్పత్తిలోనూ:
ఈ నివేదికలో భాగంగా 2017- 18 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాల మత్స్య సంపద ఉత్పత్తిని వివరించారు. ఇందులోనూ తెలంగాణ మెరుగైన స్థానంలో నిలిచింది. 2017- 18లోనే తీరప్రాంతాలున్న రాష్ట్రాలతో పోటీ పడే స్థాయిలో తెలంగాణలో మత్స్యసంపద ఉత్పత్తి ఉంది. తెలంగాణకు తీరప్రాంతం లేనందున ఇన్‌ లాండ్ మత్స్య సంపద ఉత్పత్తిలో ఆ ఏడాది 2.70 లక్షల టన్నులుగా పేర్కొన్నారు. ఇన్‌లాండ్ జాబితాలో తెలంగాణ 21 రాష్ట్రాలకంటే ముందు ఉండటం విశేషం. ప్రభుత్వం 2015 నుంచి సాగునీటి ప్రాజెక్టుల పనులతోపాటు మిషన్‌ కాకతీయను పరుగులు తీయించగా చెరువుల్లోనూ జలకళ ఉట్టిపడి మత్స్య సంపద పెరిగింది. 2017- 18 జాబితాలోనే ఈ స్థానం ఉంటే.. తాజాగా తీర ప్రాంతాలున్న రాష్ట్రాలతో దీటుగా తెలంగాణ పురోగతి ఉంటుందనేది సుస్పష్టం.

స్టార్టప్ ఇండియాలోనూ మెరుగైన స్థానం:
కేంద్రం ప్రవేశపెట్టిన స్టార్టప్ ఇండియా- స్టాండప్ ఇండియాలోనూ తెలంగాణ మెరుగైన స్థానంలో ఉన్నదని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాలను విస్తృతంగా పెంచే ఈ స్టార్టప్స్ కార్యక్రమాన్ని 2015 ఆగస్టు 15న ప్రధాని మోడీ ప్రారంభించారు. 2016 జనవరి 16న 19 ఆవిష్కరణల ప్రణాళికను ప్రకటించారు. ఈ ఏడాది జనవరి 8న దేశవ్యాప్తంగా 551 జిల్లాల్లోని 27,084 స్టార్టప్స్‌ను గుర్తించారు. టైర్-1 నగరాల్లో 55 శాతం, టైర్-2 నగరాల్లో 45 శాతం స్టార్టప్స్‌ను గుర్తించారు. గుర్తించిన స్టార్టప్స్ జాబితాలో మహారాష్ట్ర 18.9 శాతం, కర్ణాటక 14.6 శాతం, ఢిల్లీ 12.8 శాతంతో ముందున్నాయి. తర్వాత ఉత్తరప్రదేశ్ 8 శాతం, హర్యానా 5.7శాతం, తెలంగాణ 5.5 శాతంగా ఉన్నాయి. తర్వాత గుజరాత్, తమిళనాడు, కేరళ ఉండగా, మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలవి 16.6 శాతంగా ఉంది.