సీఎం కేసీఆర్‌కు మంత్రి షెకావత్ లేఖ..ప్రస్తావించిన అంశాలు

  • Published By: madhu ,Published On : December 14, 2020 / 06:27 AM IST
సీఎం కేసీఆర్‌కు మంత్రి షెకావత్ లేఖ..ప్రస్తావించిన అంశాలు

Central Minister Shekhawat letter : కాళేశ్వరం మూడో టీఎంసీ తరలింపునకు సంబంధించిన పనులతో సహా, గోదావరిపై తెలంగాణ చేపడుతున్న ఏడు ప్రాజెక్టులపై… డీపీఆర్‌ లేకుండా ముందుకు వెళ్లరాదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సూచించారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. తెలంగాణ ఫిర్యాదు నేపథ్యంలో.. ఏపీలోరాయలసీమ లిప్టు, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు వంటి ప్రాజెక్టు నిర్మాణాలను కూడా చేపట్టకూడదని ఆ లేఖలో స్పష్టం చేశారు. అక్టోబరు 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించిన అంశాల అమలుకు సంబంధించి షెకావత్‌ ఈ లేఖ రాశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు షెకావత్‌ను కలిసి జల వివాదాలపై మాట్లాడారు. కేసీఆర్‌ ఇచ్చిన లేఖకు ఆయన సమాధానం రాశారు. అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించిన అంశాలనే ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. ఇరురాష్ట్రాలూ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపాల్సిందిగా కోరారు. ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించి, అవసరమైన అనుమతులను పొందాలని సూచించారు.

కాళేశ్వరం మూడో టీఎంసీ ప్రాజెక్టు :-
గోదావరి బేసిన్‌లోని కాళేశ్వరం మూడో టీఎంసీ ప్రాజెక్టుతోపాటు…. సీతారామ, దేవాదుల -3, తుపాకులగూడెం, దిగువ పెన్‌గంగా, రామప్ప – పాకాలలాంటి ప్రాజెక్టులపై ఏపీ గతంలో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణ పనులను చేయకూడదని షెకావత్‌ తన లేఖలో స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించి… కేంద్ర జలసంఘం, గోదావరి బోర్డుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందిగా సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించడానికి సంబంధించిన పనులకు అనుమతులు ఇచ్చామని.. మూడో టీఎంసీ పనులకు అనుమతులు తీసుకోలేదని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు పనుల కోసం కేంద్రం నుంచి అవసరమైన హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర, ఇన్వెస్ట్‌మెంట్‌, పర్యావరణ అనుమతులు తీసుకోవాలని సూచించారు. అప్పటి వరకు ప్రాజెక్టు పనుల్ని చేపట్టవద్దని లేఖలో కోరారు.

కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు :-
నీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయాన్ని సరిచేయడానికి వీలుగా కొత్త ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ గతంలో రాసిన లేఖలో కోరారు. దీనికి కూడా షెకావత్‌ తన లేఖలో వివరణ ఇచ్చారు. విభజన చట్టంలోని సెక్షన్‌-89 ప్రకారం కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌ -2 ఏర్పాటయిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తోందని..ఇందుకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపారు. అయితే సుప్రీంకోర్టులో పిటిషన్లు ఉన్నందున..కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని అన్నారు. పిటిషన్లు ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వం ట్రైబ్యులన్‌ ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ఏపీ ప్రాజెక్టులపై అభ్యంతరాలపై :-
ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభ్యంతరాలనూ షెకావత్‌ ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంపు, రాయలసీమ లిప్టు ప్రాజెక్టుల పనుల్ని చేపట్టకూడదని స్పష్టం చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులు తప్ప.. మిగిలిన అన్ని ప్రాజెక్టులనూ కొత్త వాటిగానే పరిగణిస్తున్నట్టుగా భావిస్తున్నామన్నారు. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను కేంద్రానికి సమర్పించలేదని తెలిపారు. వీటి డీపీఆర్‌లను సమర్పించి, కేంద్ర జల శక్తి శాఖ పరిధిలోని అడ్వయిజరీ కమిటీ ఆమోదంతో పాటు, కేంద్ర జలసంఘం అనుమతిని తీసుకోవాలని సూచించారు. అప్పటి వరకూ పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ ప్రాజెక్టు పనుల్ని చేపట్టవద్దని సూచించారు.