తెలంగాణలో వరదలు, కేంద్ర బృందం పర్యటన

  • Published By: madhu ,Published On : October 23, 2020 / 07:40 AM IST
తెలంగాణలో వరదలు, కేంద్ర బృందం పర్యటన

Central Team Visits Hyderabad Flood affected Areas : తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం అంచనా వేసేందుకు తెలంగాణలో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పంపిన బృందాలతో తెలంగాణ సీఎస్‌ సోమేష్‌కుమార్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్ర బందానికి ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిస్థితిని పూర్తిగా వివరించారు. ప్రాథమిక అంచనా ప్రకారం 8వేల 633 కోట్ల పంట నష్టపోయినట్లు కేంద్ర బృందానికి తెలిపారు.



కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరి నేతృత్వంలో :
కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరి ప్రవీణ్ వశిష్ట నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం అధికారులతో సమావేశమైంది. రాష్ట్రంలో వ‌ర‌ద‌ల ప‌రిస్థితిపై చ‌ర్చించింది. తెలంగాణలో రహదారులకు 222 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీకి 550 కోట్ల రూపాయలు విడుదల చేసిందనే విషయాన్ని చెప్పారు.



జీహెచ్ఎంసీ పరిధిలో 567 కోట్ల నష్టం :
మూసీ నదికి వరద ముంపు, చెరువులకు గండ్లు పడటంతో కాలనీలు మునిగిన విషయాన్ని చెప్పారు. కేవంలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 567 కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు కేంద్ర బృందానికి అధికారులు వివరించారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించింది. కందికల్‌ గేట్‌ దగ్గరి నాలా పునరుద్ధరణ పనులను పరిశీలించింది. చాంద్రాయణగుట్ట పూల్‌బాగ్‌లోని వరద ముంపు ప్రాంతాల ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది.



కేంద్ర బృందంతో ఓవైసీ :
ఈ సందర్భంగా హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ కేంద్ర బృందాన్ని కలిసి వరదలతో జరిగిన నష్టాన్ని వివరించారు. దాదాపు 10 అడుగులకుపైగా రోడ్లు, ఇళ్లు వరదముంపుకు గురయ్యాయని, ప్రజలు తీవ్రంగా నష్టపోయినందున కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.



సెంట్రల్ టీమ్ పరిశీలన :
ఫలక్‌నుమా దగ్గర దెబ్బతిన్న ఆర్‌ఓబీని, ముంపుకుగురైన ప్రాంతాలను సెంట్రల్‌ టీమ్‌ పరిశీలించింది. భారీ వర్షాల కారణంగా తమ ఇళ్లలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు మొదటి అంతస్తుల్లోకి నీరు వచ్చినట్టు స్థానికులు కేంద్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు. 10 రోజులపాటు నీళ్లలో నానడం వలల్.. తమ ఇళ్ల గోడలు దెబ్బతిన్నాయని చెప్పారు. పల్లెచెరువు తెగిపోవడంతో వచ్చిన వరదతో తమ ప్రాంతానికి అపారనష్టం వాటిల్లిందని వివరించారు.



పంట నష్టం వివరాల సేకరణ :
మరోటీమ్ జిల్లాల్లో పర్యటించి పంట నష్టం వివరాలను సేకరించింది. రైతులు, స్థానికులను అడిగి నష్టం వివరాలను అంచనా వేశారు. 2020, అక్టోబర్ 23వ తేదీ శుక్రవారం కూడా కేంద్ర బృందం రాష్ట్రంలోని వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల‌‌లో పర్యటించనుంది. అన్ని జిల్లాల్లో పంట నష్టంపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరించనుంది. ఆ తర్వాత నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేయనుంది.