Chandrababu KTR Interaction : కేటీఆర్ భుజం తట్టిన చంద్రబాబు.. కృష్ణంరాజు ఇంటి దగ్గర ఆసక్తికర సన్నివేశం

టీడీపీ అధినేత చంద్రబాబు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో కరచాలనం చేశారు కేటీఆర్. చంద్రబాబు కేటీఆర్ భుజం తడిమారు.

Chandrababu KTR Interaction : కేటీఆర్ భుజం తట్టిన చంద్రబాబు.. కృష్ణంరాజు ఇంటి దగ్గర ఆసక్తికర సన్నివేశం

Chandrababu KTR Interaction : కృష్ణంరాజు పార్దివదేహానికి నివాళి అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో కరచాలనం చేశారు కేటీఆర్. చంద్రబాబు కేటీఆర్ భుజం తడిమారు.

కృష్ణంరాజుకు చంద్రబాబు నివాళి అర్పించి బయటకు వస్తున్న సమయంలో.. అదే సమయంలో సంతాపం తెలిపేందుకు వచ్చిన కేటీఆర్ ఎదురుపడ్డారు. కాగా, ఇరువురు నేతలూ ఎడమొహం, పెడమొహంగానే చేతులు కలిపి వెంటనే కేటీఆర్ లోనికి వెళ్లిపోయారు.

సుదీర్ఘకాలం తర్వాత చంద్రబాబు, కేటీఆర్ మధ్య పలకరింపులు చోటు చేసుకున్నాయి. రాజకీయంగా తెలంగాణలో టీడీపీ నామమాత్రంగానే వ్యవహరిస్తోంది. చంద్రబాబు పూర్తిగా ఏపీపైనే ఫోకస్ పెట్టారు.

కృష్ణంరాజు భౌతిక కాయానికి చంద్రబాబు నివాళి అర్పించారు. రెబల్ స్టార్ ను కోల్పోవటం బాధాకరమన్నారు. చరిత్రలో కృష్ణంరాజుకు ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు సేవ చేసేందుకే ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు చంద్రబాబు. సినీ పరిశ్రమ ఒక ప్రముఖుడిని కోల్పోవటం విషాదకరం అన్నారు. ప్రభాస్ ను పరామర్శించిన చంద్రబాబు.. ధైర్యంగా ఉండాలని చెప్పారు. కృష్ణంరాజు లేని లోటు ప్రభాస్ తీర్చాలన్నారు.

”కృష్ణంరాజుని కోల్పోవడం బాధేసింది. ఆయన నటన ఎప్పటికీ మరిచిపోలేనిది. ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చారు. సినీ ఇండస్ట్రీ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయనకు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా ఉండాలి. ఇది చాలా విషాద సమయం. ఇప్పుడే ప్రభాస్ ని కలిశా. ప్రభాస్ ధైర్యంగా ఉండాలి. కృష్ణంరాజు లేని లోటు.. ప్రభాస్ తీర్చాలి” అని చంద్రబాబు అన్నారు.

మరోవైపు మంత్రి కేటీఆర్ కృష్ణంరాజు కుటుంబసభ్యులను ఓదార్చారు. ప్రభాస్ ను ఆయన పరామర్శించారు. రేపు తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనుంది. కృష్ణంరాజు మరణ వార్త ఎంతో బాధకు గురి చేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అత్యంత పాపులర్ స్టార్లలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒకరని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు, ప్రభాస్ కు తన సంతాపాన్ని తెలియజేశారు కేటీఆర్.

ప్రముఖ నటుడు, రెబల్ స్టార్, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు ఇక లేరన్న వార్త అభిమానులను కలచివేసింది. గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కృష్ణంరాజు తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. చివరి చూపు కోసం ప్రజలు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా తరలివస్తున్నారు.