Kite String: ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా.. తప్పెవరిది?

చైనా మాంజా.. గాలిపటం ఎగరేసినా.. ఎగరేయకున్నా ప్రమాదంలో పడేస్తుంది. సామాన్య జనంపై పంజా విసురుతూ.. బ్లాక్ మార్కెట్ నగరంలో అమ్ముడువున్న మాంజా.. కైట్‌ లవర్స్‌కు మజా తెస్తున్నప్పటికీ..

Kite String: ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా.. తప్పెవరిది?

Kite String

Kite String: చైనా మాంజా.. గాలిపటం ఎగరేసినా.. ఎగరేయకున్నా ప్రమాదంలో పడేస్తుంది. సామాన్య జనంపై పంజా విసురుతూ.. బ్లాక్ మార్కెట్ నగరంలో అమ్ముడువున్న మాంజా.. కైట్‌ లవర్స్‌కు మజా తెస్తున్నప్పటికీ.. మనుషుల ప్రాణాలు తీస్తోంది. పతంగులను ఎగురవేసే సమయంలో ఎదుటివారి గాలిపటాన్ని నేలకూల్చడానికి కైంచీ అనే చైనా మాంజాను వాడుతున్నారు.

ప్లాస్టిక్ దారానికి గాజుపొడి అద్ది ఈ మాంజాను తయారు చేస్తారు. దీనివల్ల గాలిపటం ఎగురవేసే వారికి, పక్కనున్న వారి చేతులకూ గాయాలవుతాయి. పతంగులు ఎగురవేస్తున్న సమయంలో దారం మనుషుల పీకలకు చుట్టుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో శనివారం ఓ వ్యక్తి ప్రాణాలు పోగా.. ఆదివారం కామారెడ్డిలో మరో వ్యక్తి మృత్యువుతో పోరాడుతున్నాడు.

చైనా మాంజా కారణంగా గొంతు తెగి స్పాట్‌లోనే మృతిచెందిన భీమయ్య ఘటన మరవకముందే.. ఈ మాయదారి మాంజా మరో యువకుడికి మృత్యుపాశంగా మారింది.. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగింది.. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మొహమ్మద్‌ ఏజాజ్ అనే యువకుడు బైక్‌పై వెళుతుండగా ఓ చెట్టుకు చిక్కుకుపోయిన పతంగి మంజా అతని మెడకు చుట్టుకుంది.. ఈ విషయం గమనించేలోపే అతని గొంతు తెగి తీవ్ర రక్తస్రావం అయింది. ఏజాజ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు స్థానికులు. వైద్యుల సలహా మేరకు నిజామాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు..

ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఏజాజ్‌ పరిస్థితి అయినా.. శనివారం చైనా మాంజా కారణంగా భీమయ్య గొంతు తెగి చనిపోయిన విషయంలో అయినా తప్పు ఎవరిది? ఈ దుస్థితి కారణం ఎవరంటే ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యం.. వ్యాపారుల అత్యాశ.. పతంగులు ఎగరేసే వారి బాధ్యతారాహిత్యమనే చెప్పాలి. జనాల గొంతులు కోస్తున్న ఈ చైనా మాంజాను ఏళ్ల క్రితమే ప్రభుత్వం నిషేధించింది. ఇంకా మార్కెట్‌లో లభ్యమవుతూనే ఉంది.

ఈ మాంజా కొనుగోలు చేసి పతంగులు ఎగరేసే వారికి కూడా గాయాలవుతూనే ఉన్నాయి. పతంగి ఎగరేసే సమయంలో చేతులకు గాయాలవుతున్నా.. చైనా మాంజా వాడకాన్ని ఆపడం లేదు వినియోగదారులు.

కొన్నేళ్ల క్రితం కైట్స్‌ ఫెస్టివల్‌ సందర్భంగా చైనా నుంచి మాంజా దేశానికి వచ్చింది. అప్పటినుంచి లోకల్ వ్యాపారులు.. సొంతంగా సింథటిక్‌ దారానికి గాజుపొడి అద్ది మాంజాను తయారు చేయడం ప్రారంభించారు. ఈ మాంజాలో గాజుముక్కలను ఇతర రసాయనాలను కలుపుతున్నారు.. అలా ఈ దారం కత్తిలాగా మారుతోంది. ఇప్పటి వరకు పక్షులు, జంతువులకు ఈ మాంజా ప్రాణసంకటంగా మారగా.. ఇప్పుడు ఏకంగా బైక్‌లు నడిపే వారి పట్ల డెడ్లీ దారంగా మారింది.

2016లో తెలంగాణ ప్రభుత్వం చైనా మాంజా వాడకాన్ని, అమ్మకాన్ని, స్టాక్ ఉంచడాన్ని నిషేధించింది. ఆ తర్వాత అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ దారాన్ని నిషేదిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. 2017 జూలైలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ కూడా దేశవ్యాప్తంగా చైనా మాంజాను నిషేధించింది. మాంజా అమ్మినవారికి, కొన్నవారికి ఒకటి నుంచి ఐదేళ్ల జైలుశిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా, లేదంటే రెండూ విధించేలా చట్టం కూడా ఉంది.

అయినప్పటికీ అత్యంత రహస్యంగా దారాల దందా కొనసాగుతూ…మార్కెట్‌లో డేంజర్‌ మాంజా రాజ్యమేలుతోంది. నియంత్రించేందుకు కఠిన రూల్స్‌ ప్రవేశపెట్టినా వాటిని బ్రేక్‌ చేసి మరి అమ్మకాలు సాగిస్తున్నారు.