Chinna Jeeyar Swamy: 20 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు.. అది మా అభిమతం కానే కాదు: చిన్నజీయర్ స్వామి

వన దేవతలు సమ్మక్క, సారలమ్మలపై చేసిన వ్యాఖ్యలు.. వివాదాస్పదం కావడంపై శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి స్పందించారు.

Chinna Jeeyar Swamy: 20 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు.. అది మా అభిమతం కానే కాదు: చిన్నజీయర్ స్వామి

Jeeyarswamy

Chinna Jeeyar Swamy: వన దేవతలు సమ్మక్క, సారలమ్మలపై చేసిన వ్యాఖ్యలు.. వివాదాస్పదం కావడంపై శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి స్పందించారు. తాను 20 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు తప్పుగా ప్రస్తావిస్తున్నారని వ్యాఖ్యానించారు. మహిళలను, వన దేవతలను అవమానించడం తమ అభిమతం ఎంత మాత్రం కాదని స్పష్టం చేశారు. మహిళను దేవతలుగా కొలిచే తాము.. ఎన్నడూ అవమానించబోమని.. తక్కువ చేసి మాట్లాడే అవకాశం కూడా లేదని జీయర్ స్వామి చెప్పారు.

వేదాల్లో కూడా.. మాతృదేవోభవ అనే చదువుతూ.. మహిళకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని జీయర్ స్వామి చెప్పారు. తాము ఎన్నడూ ఆదివాసీలు అభివృద్ధిలోకి రావాలనే కోరుకున్నామని.. వారి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని అన్నారు. వికాస తరంగిణి అన్న సేవా సంస్థ ద్వారా.. ఆదివాసీల కోసం ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వారి కోసం విద్యా సంస్థలను నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు.

తాను 20 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడేవారు.. ఆ సందర్భాన్ని గురించి.. ఎందుకు ఆ మాటలు అనాల్సి వచ్చింది అన్నది కూడా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. తాను ఓ సన్యాసినని.. తనకు బ్యాంకు ఖాతా కూడా లేదని జీయర్ స్వామి చెప్పారు. కుల, మతాలతో సంబంధం లేకుండా.. సమాజహితం కోరడం.. సేవా కార్యక్రమాలు నిర్వహించడాన్ని తాను చాలా కాలంగా నిర్వహిస్తున్నట్టు వివరించారు. క్రైస్తవ, మహ్మదీయ వైద్యులు కూడా తమతో కలిసి వచ్చి.. సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారని జీయర్ స్వామి చెప్పారు.

రాజకీయాల్లోకి వెళ్లనున్నారా.. అన్న విలేకరుల ప్రశ్నకు జీయర్ స్వామి బదులిచ్చారు. తమకు అలాంటి ఉద్దేశం ఎంతమాత్రం లేదని.. ఏనాడూ తాను అలాంటి ఉద్దేశంతో మాట్లాడలేదని స్పష్టం చేశారు.