మొన్న అమితాబ్ నిన్న రాజమౌళి నేడు చిరంజీవి.. సినీ పరిశ్రమలో కరోనా కలకలం, కొవిడ్ బారినపడుతున్న నటులు

  • Published By: naveen ,Published On : November 9, 2020 / 02:47 PM IST
మొన్న అమితాబ్ నిన్న రాజమౌళి నేడు చిరంజీవి.. సినీ పరిశ్రమలో కరోనా కలకలం, కొవిడ్ బారినపడుతున్న నటులు

cine actors corona: మెగాస్టార్‌ చిరంజీవి కరోనా బారిన పడటంతో సినీ ఇండస్ట్రీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. కరోనా వచ్చినట్లు స్వయంగా చిరంజీవి ట్వీట్ చేశారు. ఆచార్య షూటింగ్ సందర్భంగా కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే… తనకు పాజిటివ్ వచ్చిందని చిరు ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, తనకు ఎలాంటి లక్షణాలు లేవని చెప్పారు. ఇటీవలే వరద సాయం చెక్‌లు అందించడానికి నాగార్జునతో కలిసి… చిరంజీవి… తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు.. గత నాలుగైదు రోజులుగా తనను కలిసి వాళ్లంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని చిరు సూచించారు. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందిస్తూనే ఉంటానని చిరు తెలిపారు.

ఫిల్మ్‌ ఇండస్ట్రీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. పెద్ద నటుల నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ల వరకు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇండస్ట్రీలో ఇప్పటికే రాజశేఖర్‌, జీవిత, తమన్నా, నాగబాబు, పృథ్వీరాజ్‌, రాజమౌళి, కిరవాణి కుటుంబాలు మొత్తం ఈ మహమ్మారి బారిన పడ్డారు. తమిళ హిరో విశాల్‌ తండ్రి జీకే రెడ్డికి కరోనా సోకింది. ఆ తర్వాత విశాల్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులందరూ ఈ వైరస్ బారిన పడ్డారు. వీరిలో కొందరు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండి ఈ వైరస్‌ నుంచి బయటపడగా.. తమన్నా మాత్రం ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది..

ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ బాలీవుడ్:
దర్శక బాహుబలి రాజమౌళి కూడా కరోనా బారిన పడ్డారు. డాక్టర్ల సలహా మేరకు జక్కన్నతోపాటు ఆయన కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లో ఉండి ఈ మహమ్మారి నుంచి బయటపడ్డారు. బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో బాలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రస్తుతం ఈయన కరోనా నుంచి కోలుకున్నారు. అమితాబ్ తో పాటు ఆయన కుమారుడు కోడలు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌, మనవరాలు ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

వీరంతా ఆసుపత్రుల్లో చేరి ఈ వైరస్‌ నుంచి బయటపడ్డారు. ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ మాండ్యా ఎంపీ సుమలతకు కూడా కరోనా సోకింది. ఈమె కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో ఈమెకు కరోనా నెగిటివ్ వచ్చింది. ప్రముఖ కన్నడ నటుడు ధృవ సర్జతో పాటు ఆయన భార్యకు పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఈయన సతీ సమేతంగా డాక్టర్ల పర్యవేక్షణలో ఇంట్లోనే చికిత్స తీసుకున్నారు.

పూర్తి స్థాయిలో ప్రారంభం కాని షూటింగ్ లు:
కరోనా భయం కారణంగా ఇండస్ట్రీలో ఇప్పటికే షూటింగ్‌లు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ఈ మధ్య ఇండస్ట్రీ కోలుకున్నట్టే కనిపించినా అక్కడక్కడ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. షూటింగ్‌ లో పాల్గొన్న నటులకు కరోనా సోకిందంటే మొత్తం యూనిట్ హడలిపోవాల్సి వస్తుంది.