నయా సాల్ : కేసీఆర్ వరాలు, తెలంగాణ ఉద్యోగులకు త్వరలో పీఆర్సీ

CM KCR 2021 New Year Gift PRC Report : తెలంగాణ ఉద్యోగులకు త్వరలో పీఆర్సీ రానుందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. 2020, డిసెంబర్ 31వ తేదీ గురువారం సీఎం కేసీఆర్‌తో ఉద్యోగ సంఘాలు సమావేశమయ్యాయి. ఆ సమయంలో.. బిశ్వాల్ కమిటీ సీఎస్ సోమేశ్‌కుమార్‌కు నివేదిక అందించింది. పీఆర్సీపై బిశ్వాల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌పై ప్రభుత్వం జనవరి మొదటి వారంలో అధ్యయనం చేయనుంది. ఆ తర్వాత జనవరి రెండో వారంలో… సీఎస్ సోమేశ్ కుమార్.. ఉద్యోగులతో సమావేశమవుతారు. పీఆర్సీ నివేదికపై చర్చిస్తారు. బిశ్వాల్ కమిటీ ఇచ్చిన నివేదికలో 33 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చింది. దీంతో.. ఈసారి ఎంత ఫిట్‌మెంట్ వస్తుందా అనే చర్చ జరుగుతోంది.

న్యూ ఇయర్‌ సందర్భంగా వరుసగా గుడ్‌ న్యూస్‌లు చెబుతోంది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు ఇలా వరుసగా సమస్యలపై వేగంగా స్పందిస్తోంది. ఒక్కో సమస్య పరిష్కారానికి రూట్‌మ్యాప్‌ ప్రకటిస్తూ పాలనలో వేగం పెంచారు సీఎం కేసీఆర్‌. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కలలు త్వరలో తీరబోతున్నాయి. వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 50 వేల పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రభుత్వ శాఖల వారీగా ఖాళీలు ఎన్ని ఉన్నాయనే అంశంపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం 70 వేల ఖాళీలు ఉన్నట్లుగా తేల్చారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్లను ఫిబ్రవరి నుంచి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు టీఎస్‌పీఎస్సీకి కొత్త చైర్మన్‌ను త్వరలో నియమించనున్నారు.

ఉద్యోగులకు సంబంధించి కేసీఆర్‌ ఇప్పటికే కీలక ప్రకటన చేశారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్‌ ఉద్యోగులు ఇలా తేడా లేకుండా ప్రభుత్వ సేవల్లో ఉన్న ప్రతీ ఉద్యోగి, కార్మికుడికి వేతనాలు పెంచుతామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అన్నట్టుగానే వెంటనే కార్యాచరణ ప్రారంభించారు. ఈ అంశంపై సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరిలోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. అంతకు ముందే టీజీవో, టీఎన్జీవో ఉద్యోగులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్‌. మిగిలిన ఉద్యోగ సంఘాలతోనూ వరుసగా సమావేశం కాబోతున్నారు.

మరోవైపు పీఆర్‌సీ మీద నియమించిన బిశ్వాల్ కమిషన్‌ తన నివేదికను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు సమర్పించింది. మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చితే జీతాలు తక్కువగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులపైనా కేసీఆర్‌ వరాలు కురిపించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచేందుకు అంగీకరించారు. ఇందుకు సంబంధించి అవసరమైతే ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు సర్థుబాటు చేస్తామని హామీ ఇచ్చారు. రెండున్నరేళ్ల తర్వాత మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మహిళా కమిషన్‌ను నియమించాలంటూ మహిళా సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి. ఆఖరికి కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించినా ఈ విషయంలో ప్రభుత్వం అంటీముట్టనట్టుగా వ్యవహరించింది ఇన్నాళ్లుగా. అయితే ఒక్కసారిగా మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి చైర్‌ పర్సన్‌గా ఆరుగురు సభ్యులతో మహిళా కమిషన్‌ ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్‌.

ట్రెండింగ్ వార్తలు