కూలిన ఇళ్లకు లక్ష, దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేలు, ప్రతి కుటుంబానికి రూ.10వేలు.. వరద బాధితులకు కేసీఆర్ ప్రభుత్వం పరిహారం

  • Published By: naveen ,Published On : October 19, 2020 / 04:12 PM IST
కూలిన ఇళ్లకు లక్ష, దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేలు, ప్రతి కుటుంబానికి రూ.10వేలు.. వరద బాధితులకు కేసీఆర్ ప్రభుత్వం పరిహారం

cm kcr: హైదరాబాద్ లో భారీ వర్షాలు, వరదలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం(అక్టోబర్ 19,2020) సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వారికి ఆర్థిక సాయం, నష్టపరిహారం ప్రకటించారు. వరద బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి తక్షణ సాయంగా రూ.10వేలు ఇవ్వనున్నారు. వర్షాల వల్ల ఇల్లు కూలిపోయిన వారికి రూ.లక్ష, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేలు సాయం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అలాగే దెబ్బతిన్న రోడ్లు, ఇతర మౌలిక వసతులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు రేపటి(అక్టోబర్ 20,2020) నుంచే నష్టపరిహారం అందించాలని కేసీఆర్ ఆదేశించారు.

భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఎన్నో కష్టాలకు గురయ్యారు:
నగరంలో వరదలపై సీఎం కేసీఆర్ స్పందించారు. భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఎన్నో కష్టాలకు గురయ్యారని వాపోయారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని కేసీఆర్ చెప్పారు. నగరంలో వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికి ఆర్థిక సాయంగా తక్షణమే రూ.10వేలు ఇస్తామన్నారు. రేపటి నుంచే ఆర్థిక సాయం అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆర్థిక సాయం కార్యక్రమానికి పర్యవేక్షించాలని సీఎస్ ను కేసీఆర్ ఆదేశించారు. పేదలను ఆదుకునేందుకు మున్సిపల్ శాఖకు రూ.550 కోట్లు ఇచ్చామన్నారు.

తెలంగాణకు రూ.10కోట్లు విరాళం ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం:
పేదలకు సాయం అందించడం అతి ముఖ్యమైన బాధ్యతగా స్వీకరించి నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు అందులో భాగస్వామ్యం కావాలని సీఎం కేసీఆర్ కోరారు. బాధితులు ఎంతమంది ఉన్నా సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాగా, వరదలతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ రాష్ట్రానికి తమిళనాడు ప్రభుత్వం అండగా నిలిచింది. తమిళనాడు ప్రభుత్వం తెలంగాణకు రూ.10కోట్లు విరాళం ప్రకటించింది.