ధరణి పోర్టల్ ప్రారంభం, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వివరించిన సీఎం కేసీఆర్

  • Published By: madhu ,Published On : October 29, 2020 / 01:53 PM IST
ధరణి పోర్టల్  ప్రారంభం, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వివరించిన సీఎం కేసీఆర్

cm kcr explaining about dharani portal : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. 2020, అక్టోబర్ 29వ తేదీ గురువారం దత్తత గ్రామమైన మూడుచింతలపల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ పోర్టల్ ను ప్రారంభించి..ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు.



ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాత..అక్రమ రిజిస్ట్రేషన్‌లు జరగవని ఖరాఖండిగా చెప్పారు. ఎమ్మార్వో, కలెక్టర్ ఒపెన్ చేద్దామని అనుకున్నా..సాధ్యం కాదన్నారు. ధరణి పోర్టల్ విషయంలో 150 నుంచి 200 సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ధరణి వెబ్ సైట్ లో కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూ రికార్డులు పొందుపరిచినట్లు, కరోనా లేకుంటే..ఆరు నెలల క్రితమే అందుబాటులోకి వచ్చేదన్నారు.



రిజిస్ట్రేషన్ విధానం…
‘రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పైరవీలు అవసరం లేదు. ధరణి పోర్టల్ లో అప్లై చేసుకోవచ్చు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు 141 ఉండేవి. వాటికి అదనంగా…570 ఎమ్మార్వో ఆఫీసులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా మారాయి. మ్యుటేషన్ విషయంలో పలు ఇబ్బందులు ఉండేవి. స్లాట్ ముందే బుక్ చేసుకుని ఫీజు కట్టేయవచ్చు. ధరణి పోర్టల్ లో నమూనా పత్రాలు అందుబాటులో ఉన్నాయి. డాక్యుమెంట్ రైటర్ విషయంలో ఫీజులు కేటాయించాం. కొద్ది రోజుల్లో డాక్యుమెంట్ రైటర్ లను నియమిస్తాం.



ఎవరైనా భూమి అమ్మినప్పుడు, కొనేటప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఎమ్మార్వో ఆఫీసుకు ఇన్ ఫాం చేయాలి. చలాన ప్రకారం ఫీజు కట్టేయాలి. మ్యుటేషన్ ఫీజు కూడా ఉంటుంది. రెండు చెల్లించిన తర్వాత..కోరుకున్న స్లాట్ అలాట్ మెంట్ అవుతుంది. 15 నుంచి 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తవుతుంది. ఎవరి పాస్ బుక్ వారికి ఇస్తారు.



ధరణి పోర్టల్ కాపీ కూడా ఇస్తారు. ఏ ఆఫీసుకు పోయే అవసరం ఇక ఉండదు. ఒకరి పాస్ బుక్ లో డిలీట్, మరో పాస్ పుస్తకంలో ఎంట్రీ అవుతుంది. కొనే వ్యక్తికి పాస్ బుక్ లేకపోతే..సంబంధిత ఫీజు కడితే..పాస్ బుక్ ఇవ్వడం జరుగుతుంది. కరెక్టు అడ్రస్ ఇస్తే..నేరుగా ఇంటికే వస్తుంది. ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా రిజిస్ట్రేషన్ అవుతుంది.



పాత రిజిస్ట్రేషన్ భూముల విలువలను ఇప్పుడు కూడా నిర్ధారించాం. ఎక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచలేదు. ప్రభుత్వం నిర్ణయించిన భూమి ధర ఎంత ఉందో..దాని ప్రకారమే..డబ్బులు కట్టాల్సి ఉంటుంది’ అంటూ సీఎం కేసీఆర్ వివరించారు.