‘ధరణి’పై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

‘ధరణి’పై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

KCR Key Decision on Dharani Portal Land Disputes  : ‘ధరణి’పై సమీక్షలో సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. వ్యవసాయ సంబంధిత భూవివాదాలపై జిల్లా కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సమస్యలపై స్వయంగా జిల్లా కలెక్టర్లే బాధ్యతలను పర్యవేక్షించాలని ఆదేశించారు. వ్యవసాయ భూముల విషయంలో సందిగ్ధతలను జిల్లా కలెక్టర్లు 2 నెలల వ్యవధిలో పరిష్కరిస్తారని సీఎం తెలిపారు. ధరణి పోర్టల్‌లో మరిన్ని ఆప్షన్లు పెట్టనున్నట్టు సీఎం వెల్లడించారు. ధరణి పోర్టల్‌ నిర్వహణ, మెరుగు పర్చాల్సిన అంశాలపై ప్రగతిభవన్‌లో  ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

‘కోర్టుల విచారణలో ఉన్న భూవివాదాలు మినహా, భూరికార్డుల సమగ్ర సర్వే సందర్భంగా పార్ట్‌–బీలో చేర్చిన భూములకు సంబంధించిన అంశాల న్నింటినీ కలెక్టర్లు 60 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్ణయాలు తీసుకో వాలన్నారు. రెవెన్యూ కోర్టుల్లోని వివాదాలను పరిష్కరించేందుకు జిల్లాకు ఒకటి చొప్పున కలెక్టర్ల ఆధ్వర్యంలో ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సరిహద్దు వివాదాలపై కలెక్టర్లు సర్వే నిర్వహించాలన్నారు.

ధరణి పోర్టల్‌ కు ముందు రిజిస్ట్రేషన్‌ భూములను రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్ల ఆధారంగా, కొన్నవారి పేరిట జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మ్యుటేషన్‌ చేయాలని సూచించారు. మీ–సేవ ద్వారా మ్యుటేషన్‌ దరఖాస్తులు స్వీకరించి, స్లాట్లు కేటాయించాలని తెలిపారు. క్రమబద్ధీకరించిన భూముల వివరాలను ధరణిలో నమోదు చేయాలి. పట్టాదారు పాస్‌ బుక్కులు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కోర్టుల ద్వారా, కలెక్టర్ల ఆధ్వర్యంలోని ట్రిబ్యునళ్ల ద్వారా వచ్చిన అధికారిక తీర్పుల ప్రకారం ధరణిలో భూములకు సంబంధించిన వివరాల్లో మార్పులు, చేర్పులు చేపట్టాలి. కోర్టు పోర్టల్‌ను ధరణిలో చేర్చాలి. సేత్వార్‌ వ్యత్యాసాలపై కలెక్టర్లు విచారణ జరిపి, తుది నిర్ణయం తీసుకోవాలి. ధరణిలో నమోదు చేసి, పాసు బుక్కులు ఇవ్వాలని సూచించారు.