Huzurabad : హుజూరాబాద్ లో ఇల్లు లేకుండా ఏ దళిత కుటుంబం ఉండకూడదు : కేసీఆర్

10TV Telugu News

cm kcr Key orders to collectors on dalit bandhu scheme : హుజురాబాద్‌లో సొంత ఇల్లు లేకుండా ఏ దళిత కుటుంబం ఉండకూడదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈరోజు ప్రగతి భవన్ లో సీఎం అధ్యక్షతన జరిగిన దళితబంధుపై అవగాహన సదస్సులో సీఎం కేసీఆర్ దళితులపై వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..100 శాతం ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని సీఎం అధికారులను ఆదేశించారు. దళితులకు స్థలం ఉంటే ఇళ్ల నిర్మాణ కోసం ప్రభుత్వం సాయం చేస్తుందని తెలిపారు. స్థలాలు లేని వారికి ఆయా ప్రాంతాల్లో ఉండే స్థలాలను కొనుగోలు చేసి వాటిలో ఇల్లు కట్టి దళితులకు ఇవ్వాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దళిత వాడల్లో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని..తాగునీరు. రోడ్లు వంటి మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని ఆదేశించారు.

దళితులు సగౌరవంగా జీవించటానికి దశలవారీగా తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. దళిత వాడల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే పూర్తి చేయాలన్నారు. 10 రోజుల్లో హుజూరాబాద్ లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి అసైన్డ్ సహా దళితుల అన్నిరకాల భూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రేషన్ కార్డులు,పెన్షన్లు సహా అన్ని సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రతీ దళిత వాడలోను వివిధ వ్యాధులను బాధపడేవారిని కూడా గుర్తించాలని..దానిపై ఓ నివేదిక తయారు చేసిన తనకు వెంటనే అందజేస్తే బాధితులకు ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందజేసేలా ఏర్పాటు చేస్తామని ప్రగతి భవన్ లో హుజూరాబాద్ దళిత బంధులతో మాట్లాడుతు సీఎం హామీ ఇచ్చారు. దళిత బంధు పతకాన్ని తెలంగాణ వ్యాప్తంగా దళితులకు అమలుచేస్తామని వెల్లడించారు. దళితుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

తెలంగాణ ‘దళితబంధు’ కేవలం కార్యక్రమం కాదని.. ఇది ఒక ఉద్యమమని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. హుజూరాబాద్‌ ప్రతినిధులు సాధించే విజయం మీదేనని.. యావత్‌ తెలంగాణ దళితబంధు విజయం ఆధారపడి ఉందని తెలిపారు. అందరూ ఆ దిశగా దృఢ నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఏ ఉద్యమం అయినా ఒక్కడితోనే ప్రారంభం అవుతుందని అలాగే తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం కూడా ఒక్కడితో ప్రారంభమైందని అలా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని అన్నారు. నమ్మిన ధర్మాన్ని కట్టుబడి ప్రయాణం కొనసాగించినప్పుడు భారత రాజకీయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి విజయం సాధిస్తామని ఆనాటి తెలంగాణ ఉద్యమాన్ని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. దళిత బంధు దేశానికే ఆదర్శం కానుంది.. రూ. లక్ష కోట్లు ఖర్చు చేయనున్నామని స్పష్టం చేసారు కేసీఆర్‌.

అలాగే తాను నమ్మిన ధర్మానికి కట్టుబడి ప్రయాణం కొనసాగించినప్పుడే విజయం సాధ్యమన్నారు.అలా తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కృషితో దళిత సమాజంలో వెలుతురు ప్రసరించిందన్నారు. మనిషిపై మనిషి వివక్ష చూపే దుస్థితి గురించి.. సెంటర్‌ ఫర్‌ సెబాల్టర్న్‌ స్టడీ ద్వారా అధ్యయనం చేసానని సీఎం తెలిపారు. దళితవాడల్లో ఇప్పటికే నమోదైన పరస్పర కేసులను పోలీస్‌స్టేషన్లలో రద్దు చేసుకోవాలని సూచించారు. పరస్పర సౌభ్రాతృత్వాన్ని పెంచుకోవాలని, అప్పుడే మన విజయానికి బాటలుపడుతాయన్నారు. ఆర్థికంగా ప్రతీ దళితుడు బలపడాలని అప్పుడే దళితులపై వివక్ష పోతుందని సూచించారు. మనుషులు కక్షలు, విద్వేషాలు విడనాడాలని..అవి పోతేనే సాటి మనిషిని మనిషిగా చూడగలమని సీఎం కేసీఆర్ ఈ సందర్బంగా సూచించారు.

10TV Telugu News