కేసీఆర్ బర్త్ డే : కోటి వృక్షార్చన, జలవిహార్ లో 68 కిలోల కేక్

కేసీఆర్ బర్త్ డే : కోటి వృక్షార్చన, జలవిహార్ లో 68 కిలోల కేక్

Koti Vruksha Archana Birthday gift : కేసీఆర్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను టీఆర్‌ఎస్‌ ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్‌ చేసింది. కోటి వృక్షార్చన ఒక గంటలో రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలను నాటనున్నారు. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటనున్నారు. కోటి వృక్షార్చనలో పాల్గొనేందుకు టాలీవుడ్‌ ప్రముఖ హీరోలు రెడీ అయ్యారు. ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ పిలుపుతో.. కోటి వృక్షార్చనకు అనూహ్య స్పందన లభిస్తోంది. టీఆర్ఎస్‌ అధినేత పుట్టినరోజును పురస్కరించుకుని ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులు సేవా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనాథ, వృద్ధాశ్రమాల్లో పండ్ల పంపిణీ, అన్నదానం చేయనున్నారు. జలవిహార్‌లో 68కిలోల కేక్‌ను మంత్రులు కట్ చేయనున్నారు. కేసీఆర్ జీవిత విశేషాలు, తెలంగాణ ఉద్యమం, రాజ‌కీయ ప్రస్థానాన్ని వివ‌రిస్తూ.. త్రీడి గ్రాఫిక్స్‌లో రూపొందించిన 30 నిముషాల డాక్యుమెంట‌రీని ప్రదర్శించనున్నారు.

కేసీఆర్‌ బర్త్ డే సందర్భంగా..దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో పూజలు, ప్రార్థనలు చేయనున్నాయి గులాబీ శ్రేణులు. రెండున్నర కిలోల బంగారంతో చేయించిన చీరను.. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత సమర్పించనున్నారు. ఆలయంలో మృత్యుజయ మహాహోమం, నవగ్రహ పూజ, ఆయుష్‌ హోమం, కోటి కుంకుమార్చన నిర్వహించనున్నారు. సికింద్రాబాద్‌ గణపతి దేవాలయంలో కల్యాణం, విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. నాంపల్లి హజరత్‌ యూసుఫిన్‌ దర్గాల్లో చద్దర్‌ సమర్పిస్తారు. అమీర్‌పేట గురుద్వారాలో గురుగ్రంధ్‌కు పూజలు చేస్తారు.

కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణపై రూపొందించిన ప్రత్యేక పాటలను ఆవిష్కరించనున్నారు. వీటికి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే విడుదలయ్యాయి. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అమ‌లు చేస్తున్న సంక్షేమ పథ‌కాలతో పాటు.. సాగునీటి ప్రాజెక్టుల విశేషాలను తెలుపుతూ ప్రముఖ గాయ‌కులు పాడిన పాట‌ల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.