కొత్త వ్యవసాయ బిల్లు తేనేపూసిన కత్తి, రాజ్యసభలో వ్యతిరేక ఓటు వేయాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ ఆదేశం

  • Published By: naveen ,Published On : September 19, 2020 / 02:53 PM IST
కొత్త వ్యవసాయ బిల్లు తేనేపూసిన కత్తి, రాజ్యసభలో వ్యతిరేక ఓటు వేయాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ ఆదేశం

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యతిరేకించారు. వ్యవసాయ బిల్లుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ బిల్లు.. తేనేపూసిన కత్తిలాంటిది అని కేసీఆర్ వర్ణించారు. దాన్ని కచ్చితంగా వ్యతిరేకించి తీరాలని కామెంట్ చేశారు. వ్యవసాయ బిల్లు రైతులకు అన్యాయం చేసేలా ఉందని చెప్పారు. వ్యవసాయ బిల్లు రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉన్నారు.

వ్యవసాయ బిల్లు కార్పొరేట్ వ్యాపారులకు లాభం చేకూర్చేలా ఉందని కేసీఆర్ ఆరోపించారు. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో కేంద్రం ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంది అని కేసీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయ బిల్లుని రాజ్యసభలో వ్యతిరేకించాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావుకి కేసీఆర్ సూచించారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేయాలని టీఆర్ఎస్ ఎంపీలను ఆదేశించారు కేసీఆర్.

రైతులను దెబ్బ తీసి కార్పొరేటు వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఉంది:
‌కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉంద‌న్నారు కేసీఆర్. రైతులను దెబ్బ తీసి కార్పొరేటు వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఉంద‌న్నారు. ”పైకి.. రైతులు తమ సరుకును ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో చెప్పారు.

వాస్తవానికి ఇది వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరకును కొనుగోలు చేయడానికి ఉపయోగపడే విధానం. కార్పొరేట్ గద్దలు దేశమంతా విస్తరించడానికి, ప్రైవేటు వ్యాపారులకు దారులు బార్ల చేయడానికి ఉపయోగపడే బిల్లు.

రైతులు తమ సరుకును దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్నారు. నిజానికి రైతులు తమకున్న కొద్దిపాటు సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్లి అమ్మడం సాధ్యమేనా? ఇది తేనె పూసిన కత్తిలాంటి చట్టం. దీన్ని కచ్చితంగా వ్యతిరేకించి తీరాలి” అని కేసీఆర్ స్పష్టం చేశారు.

మక్కలు దిగుమతి చేస్తే రైతుల పరిస్థితి ఏంటి?
ప్రస్తుతం మక్కల దిగుమతిపై 50 శాతం సుంకం అమలులో ఉంది. దీనిని 15 శాతానికి తగ్గించి కోటి టన్నుల మక్కలు దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 70-75 లక్షల టన్నులను కొనుగోలు చేసింది. 35 శాతం సుంకం తగ్గించడం ఎవరి ప్రయోజనం ఆశించి చేసింది.

దేశం ఆర్థిక సంక్షోభంలో ఉండే సమయంలో ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు. మన దేశంలోనే పుష్కలంగా మక్కలు పండుతున్నాయి. సుంకం తగ్గించి మరీ మక్కలు దిగుమతి చేస్తుంటే మన దేశ రైతుల పరిస్థితి ఏమిటి? “అని కేసీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయ బిల్లుతో రైతాంగానికి, పేదలకు తీరని నష్టం జరుగుతుందని ఎంపీ కేశవరావు వాపోయారు. రెండు ఆర్డినెన్స్ లను రాజ్యసభలో అడ్డుకుంటామని చెప్పారు. రాష్ట్రాల హక్కులను కాలరాసేలా కేంద్రం చట్టాలు ఉన్నాయని కేకే మండిపడ్డారు.

కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావించిన వ్యవసాయ బిల్లులకు ఎన్టీఏ మిత్రుల నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. రైతు వ్యతిరేక బిల్లుగా అభివర్ణిస్తూ శిరోమణి అకాలీదళ్ కు చెందిన హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ బిల్లును వ్యతిరేకించగా, వైసీపీ మద్దతు పలికింది.

కేంద్రం మూడు నెలల కిందట తీసుకొచ్చిన మూడు ఆర్డినెన్సులపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆర్డినెన్సుల స్థానంలో తీసుకొచ్చిన బిల్లుల్లో ఒకటి మంగళవారం(సెప్టెంబర్ 15, 2020)న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ఆమోదం పొందగా మిగతా రెండు గురువారం(సెప్టెంబర్ 17,2020) ఆమోదం పొందాయి. ఈ బిల్లులును వ్యతిరేకిస్తూ బీజేపీ మిత్ర పక్షం, ఎన్డీయే కూటమిలోని పార్టీ శిరోమణి అకాలీదళ్ నేత, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ తన పదవికి రాజీనామా చేశారు. కౌర్ రాజీనామా చేసినా శిరోమణి అకాలీదళ్ ఎన్టీయేలోనే కొనసాగుతోంది.

అసలు ఏమిటీ మూడు బిల్లులు.. అందులోనూ గురువారం ఆమోదం పొందిన రెండు బిల్లుల్లో ఏముంది? రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు? శిరోమణి అకాలీదళ్, మరికొన్ని ఇతర పార్టీలు కానీ, రైతుల సమస్యలు, హక్కుల కోసం పోరాడే సంస్థలు కానీ చెబుతున్న అభ్యంతరాలేమిటి?

ఆర్డినెన్సుల నుంచి చట్టాలుగా మారనున్న బిల్లులు
1) నిత్యవసర సరకుల(సవరణ) బిల్లు (ది ఎసెన్షియల్ కమోడిటీస్(అమెండమెంట్) బిల్ 2020). ఇది మంగళవారమే లోక్‌సభ ఆమోదం పొందింది.
2) ‘రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) బిల్లు’ (ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్(ప్రమోషన్, ఫెసిలిటేషన్) బిల్)
3) ‘రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద బిల్లు-2020(ది ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ – 2020)లు మిగతా రెండు. ఇవి గురువారం లోక్‌సభ ఆమోదం పొందాయి.
ఈ మూడు బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పంజాబ్, హరియానాలలో ఈ ఆందోళనలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా ఆగస్టులోనే పంజాబ్ అసెంబ్లీ తీర్మానం చేసింది.

ఈ మూడు చట్టాలు రైతుకు మేలు చేసేలా కనిపించినా ఏమాత్రం ప్రయోజనకరం కావని.. వర్తకులు, బహుళ జాతి కంపెనీల గుప్పిట్లో రైతులు చిక్కుకునేలా చేస్తాయని విపక్షాలు, రైతుల ప్రయోజనాల కోసం పోరాడే సంస్థలు వాదిస్తున్నాయి. సన్నకారు రైతులను కష్టాల్లోకి నెడతాయని, ఈ చట్టాల వల్ల రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయని కూడా అంటున్నారు.