సీఎం కేసీఆర్ మరో యాగం‌..ఆ తర్వాత కేటీఆర్‌కి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే చాన్స్‌

సీఎం కేసీఆర్ మరో యాగం‌..ఆ తర్వాత కేటీఆర్‌కి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే చాన్స్‌

CM KCR preparing for another Yajnam : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దైవభక్తి చాలా ఎక్కువ. ఇప్పటికే పలు యాగాలు, హోమాలు చేసిన కేసీఆర్‌.. మరో భారీ క్రతువుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పునర్‌నిర్మించిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రారంభోత్సవానికి సుదర్శన యాగం, చండీయాగం, రాజ శ్యామల యాగం నిర్వహించే ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నారు. ఇవన్నీ పూర్తైన తర్వాతే తనయుడు కేటీఆర్‌కి ప్రభుత్వ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ నేతల్లో చర్చ జరుగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో యాగాలు, హోమాలు, ఇతర ధార్మిక కార్యక్రమాలంటే ముందుగా గుర్తుకొచ్చేంది తెలంగాణ సీఎం కేసీఆర్‌. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయుత మహా చండీయాగం.. 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందుకు రాజ శ్యామల యాగం చేశారు. పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా యజ్ఞం చేశారు. అటువంటి కేసీఆర్‌ ఇప్పుడు మరోసారి యాగానికి సిద్ధమవుతున్నారు.

కేసీఆర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆయల పునర్నిర్మాణం పూర్తి కావచ్చింది. ఫిబ్రవరి లేదా మార్చిలో పార్రంభించే అవకాశం ఉంది. ఆలయ పనులపై తర్వలో ఉన్నత స్థాయి సమీక్ష జరిపి.. ప్రారంభోత్సవ తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. ఆ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ సహా దేశంలోని ప్రముఖులను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఆలయ ప్రారంభోత్సవ సమయంలో సుదర్శన యజ్ఞంతో పాటు చండీయాగం, రాజశ్యామల యాగం చేసే యోచలో కేసీఆర్‌ ఉన్నట్టు సమాచారం. ఫిబ్రవరి లేదా మార్చిలో ఆ మహా క్రతువు జరిపే అవకాశం ఉంది.

యాదాద్రి మహా క్రతువు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తన తనయుడు కేటీఆర్‌కి పట్టాభిషేకం చేసి.. సీఎం బాధ్యతల నుంచి వైదొలగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని ఇటీవల పార్టీ నాయకులు బాహాటంగానే ప్రకటనలు చేశారు. జనవరి మొదటి వారంలోపే అధికార పగ్గాల అప్పగింత ప్రక్రియ పూర్తవుతుందని ప్రచారం జరిగినా.. పలు కారణాలతో జాప్యం జరుగుతోందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇచ్చే కేసీఆర్‌.. సంక్రాంతి పండుగకు ముందు కేటీఆర్‌ని సీఎం చేయడం ఎందుకున్న భావంతో ఉన్నారు.

కేసీఆర్‌ చేతుల మీదుగానే యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి హోదాలోనే లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రారంభించాలన్న నిర్ణయించుకున్నారు. ఈ కారణంగానే కేటీఆర్‌కి పగ్గాలు అప్పగించే విషయంలో జాప్యం జరుగుతోందని టీఆర్‌ఎస్‌లో ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలల్లోనే కేటీఆర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడారనడంలో ఎలాంటి సందేహం అవసరంలేదని గులాబీ నేతలు ఢంకా బజాయించి చెబుతున్నారు. ముహూర్తం ఎప్పుడన్న అంశంపైనే అందరిలో ఉత్కంఠ నెలకొంది.