శ్రీ నరసింహ గోవింద : యాదాద్రికి సీఎం కేసీఆర్

  • Published By: madhu ,Published On : September 13, 2020 / 06:13 AM IST
శ్రీ నరసింహ గోవింద : యాదాద్రికి సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..యాదాద్రి పర్యటనకు సిద్ధమయ్యారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఆయన యాదాద్రి క్షేత్రానికి వెళ్లనున్నారు. 2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గాన యాదాద్రికి చేరుకోనున్న సీఎం… సాయంత్రం వరకు అక్కడే గడపనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి.. అధికారులతో సమీక్ష జరపనున్నారు.



ప్రభుత్వం యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. తిరుమల తర్వాత ఆ స్థాయిలో యాదాద్రి టెంపుల్‌ అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. అందులోనే భాగంగా కేసీఆర్‌ స్వయంగా ఆలయ పనులను సమీక్షిస్తున్నారు. ఆలయంలో మార్పులు చేర్పుల నుంచి ప్రతీది ఆయన సూచనల మేరకే పునర్నిర్మాణం జరుగుతోంది.

తుదిదశకు చేరుకున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను కేసీఆర్‌ ఆదివారం మరోసారి పరిశీలించనున్నారు. ఆయన నేరుగా రహదారి మార్గంలో యాదాద్రికి వెళ్లనున్నారు. సీఎం గతేడాది డిసెంబర్‌ 17న యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. పనుల పురోగతిపై సమీక్షించారు. ప్రస్తుతం ప్రధానాలయ పనులు పూర్తికాగా.. తుది దశ పనుల్లో భాగంగా ఆలయానికి మెరుగులు దిద్దుతున్నారు.



ప్రధానాలయం పక్కనే నిర్మిస్తున్న శివాలయం, పుష్కరిణి నిర్మాణాలు కూడా పూర్తి కావొచ్చాయి. వీటన్నింటినీ సీఎం కేసీఆర్‌ పరిశీలించనున్నారు. ప్రెసిడెన్సిషియల్‌ సూట్స్‌, రింగ్‌రోడ్డు, పెద్దగుట్టపై అభివృద్ధి పనులను కేసీఆర్‌ స్వయంగా పరిశీలించే అవకాశాలున్నాయి. అనంతరం పనుల పురోగతిపై ఆయన అక్కడి అధికారులతో సమీక్షించనున్నారు.

ఆలయ చివరి దశ పనులతో పాటు.. అనుబంధ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. నాలుగు అంతస్తుల్లో నిర్మిస్తున్న ప్రసాదం కాంప్లెక్స్‌ భవనం పూర్తయ్యింది. కింది రెండు ఫ్లోర్లలో ప్రసాదాల తయారీ కోసం ఆధునిక పద్దతులతో వంటశాలను ఏర్పాటు చేస్తున్నారు. నాలుగో అంతస్తులో ప్రసాద విక్రయాల కోసం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.



ప్రాకార మంటపాల అంతర బాహ్య సాలహారాల్లో ఏర్పాటు చేయనున్న విగ్రహాల నమూనాలను ఇటీవల త్రిదండి చినజీయర్‌ స్వామి వారు పరిశీలించి ఫైనల్‌ చేశారు. సాలహారాల్లో నరసింహుడి బ్రహ్మోత్సవ రూపాలు, దశావతారాలు, అష్టలక్ష్మి, శ్రీకృష్ణుడి పలు అవతారాల విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. యాదాద్రి కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా.. అహ్లాదకరమైన వాతావరణంతో మిళితమయ్యేలా పరిసరాలు ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

సీఎం సూచనల మేరకు యాదాద్రి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ పచ్చని చెట్లతో అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్నాయి. స్వామి వారి కొండ చుట్టూ 108 రకాల మొక్కలతో హరితమయం చేశారు. సుమారు 22 కోట్లతో మొక్కల పెంపకం, గార్డెనింగ్‌ పనులు చేపట్టారు. అలాగే కొండ చుట్టూ గిరిప్రదక్షిణ కోసం రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు.



వివిధ ప్రాంతాల నుంచి వాహనాలలో వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా.. యాదాద్రి కొండ చుట్టూ నిర్మిస్తున్న రింగ్‌రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. తుర్కపల్లి, రాజాపేట, రాయగిరి, వంగపల్లి నుంచి యాదగిరిగుట్టకు వచ్చే మార్గాలను అనుసంధానిస్తూ దీన్ని నిర్మిస్తున్నారు. ఆయా మార్గాల నుంచి వాహనాలు గుట్టకు రాకుండానే ఇతర మార్గాల వైపు మళ్లించేలా నిర్మిస్తున్నారు.

ప్రధాన ఆలయ పునర్ నిర్మాణ పనులు దాదాపు పూర్తికావడంతో టెంపుల్ సిటీలో కాటేజీ నిర్మాణాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే కాటేజీల నిర్మాణానికి సహకరించేందుకు దాతలు, పలు సంస్థలు ముందుకు రావడంతో వారితో సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానాలయం పనులు పూర్తి కావడంతో సీఎం కేసీఆర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.